బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Jan 08, 2021 , 20:33:37

బిట్ కాయిన్ దూకుడు: న‌్యూ హైట్స్‌కి ఫ‌స్ట్ టైం

బిట్ కాయిన్ దూకుడు: న‌్యూ హైట్స్‌కి ఫ‌స్ట్ టైం

లండ‌న్‌: క‌్రిప్టో క‌రెన్సీ బిట్ కాయిన్ విలువ దూసుకుపోతున్న‌ది. గురువారం జ‌రిగిన ట్రేడింగ్‌లో 40 వేల డాల‌ర్ల‌ను తాకింది. బిట్ కాయిన్ పుట్టిన‌ప్ప‌టి నుంచి దాని విలువ గ‌రిష్ఠ స్థాయికి దూసుకెళ్ల‌డం ఇదే మొద‌టిసారి. కేవ‌లం ఐదు రోజుల ట్రేడింగ్‌లోనే 10 వేల డాల‌ర్లు పెంచుకున్నది బిట్ కాయిన్‌. గ‌త శ‌నివారం బిట్ కాయిన్ విలువ 30 వేల డాల‌ర్లు మాత్ర‌మే. 

గురువారం అంత‌ర్గ‌త ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ గ‌రిష్ఠంగా 10.4 శాతం పెరిగి 40,380 డాల‌ర్ల‌కు చేరుకోగా, తిరిగి 38,950 డాల‌ర్ల‌కు ప‌డిపోయి 40 వేల డాల‌ర్ల వ‌ద్ద స్థిర‌ప‌డింది. 

ఇక ముందు మ‌రికొంత‌కాలం బిట్ కాయిన్ విలువ మ‌రింత దూకుడుగా దూసుకెళ్తుంద‌ని మార్కెట్ అన‌లిస్ట్ ఎడ్వ‌ర్డ్ మోయా వ్యాఖ్యానించారు. ఈ నెలాఖ‌రులో అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ ప‌దవీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌రుత్తేజానికి 100 రోజుల ఉద్దీప‌న ప్యాకేజీ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని ఎడ్వ‌ర్డ్ మోయా చెప్పారు. అదే జ‌రిగితే డాల‌ర్ విలువ బ‌ల‌హీన ప‌డి.. ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డి మార్గంగా ప‌సిడి.. క్రిప్టో క‌రెన్సీ బిట్ కాయిన్ నిలుస్తాయి. క‌నుకే బిట్ కాయిన్ విలువ మ‌రింత పెరుగుతుంద‌ని ఎడ్వ‌ర్డ్ అంచ‌నా వేశారు. 

శ‌ర‌వేగంగా దూసుకెళ్తున్న బిట్ కాయిన్ విలువ మ‌రోద‌ఫా స‌ర్దుబాటుకు గుర‌వుతుంద‌న్న చ‌ర్చ మొద‌లైంది. యూరోపియ‌న్ యూనియ‌న్‌కు చెందిన మార్కెట్ విశ్లేష‌కులు ఒక‌రు మాట్లాడుతూ కొన్ని వారాల త‌ర్వాత బిట్ కాయిన్ విలువ స‌ర్దుబాటు అనివార్యం అని చెప్పారు. ఒక‌వేళ భారీగా ప‌త‌న‌మైనా.. క‌రోనా మ‌హ‌మ్మారి బ‌బుల్‌గా బిట్ కాయిన్ మ‌ళ్లీ దూసుకువెళుతుంద‌ని ఆశాభావంతో ఉన్నారు. 

క‌రోనా మ‌హ‌మ్మారి విశ్వాన్ని వ‌ణికిస్తుండ‌టంతో కేవ‌లం 12 సంవ‌త్స‌రాల చ‌రిత్ర గ‌ల బిట్ కాయిన్.. గ‌త మార్చి నుంచి పెరిగిపోతూ వ‌చ్చింది. అంత‌కుముందు బిట్ కాయిన్ విలువ కేవ‌లం 5000 డాల‌ర్లు మాత్ర‌మే. గ‌మ్మ‌త్తేమిటంటే ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థ పే పాల్‌.. డిజిట‌ల్ చెల్లింపుల కోసం బిట్ కాయిన్‌ను వినియోగిస్తామ‌ని గ‌త అక్టోబ‌ర్‌లో ప్ర‌క‌టించింది. 

పే పాల్‌ ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఇంట‌ర్నేష‌న‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గ‌జం జేపీ మోర్గాన్ చేజ్ మ‌రో అడుగు ముందుకేసి ప‌సిడికి క్రిప్టో క‌రెన్సీ ప్ర‌త్యామ్నాయంగా రూపుదిద్దుకున్న‌ద‌ని వ్యాఖ్యానించింది. ఈవారంలో బిట్ కాయిన్ విలువ 1.46 ల‌క్ష‌ల వ‌ర‌కూ వెళ్లొచ్చ‌ని అంచ‌నా వేసింది. 

ప‌సిడికి ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డి మార్గంగా బిట్ కాయిన్ అవ‌త‌రించే అవ‌కాశం ఉంద‌ని జేపీ మోర్గాన్ చేజ్ భావిస్తున్న‌ది. క్రిప్టో క‌రెన్సీల పెరుగుద‌ల‌కు పోటీగా ప‌లు దేశాల సెంట్ర‌ల్ బ్యాంకులు డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. 

సోష‌ల్ మీడియా జెయింట్ ఫేస్‌బుక్ సొంతంగా డిజిట‌ల్ క‌రెన్సీ యూనిట్.. లిబ్రాను త‌యారుచేసేందుకు సిద్ధ‌మైన త‌రుణంలో చైనా, స్వీడ‌న్, అమెరికా ఫెడ్ రిజ‌ర్వ్ తో స‌హా ప‌లు దేశాల కేంద్రీయ బ్యాంకులు సొంత డిజిట‌ల్ అప్లికేష‌న్ల‌ను ప‌రీక్షించేందుకు సిద్ధం అవుతున్నాయి. 

అయితే క్రిప్టో క‌రెన్సీల‌ను నేర‌స్తులు వాడ‌తార‌న్న విమ‌ర్శ ఉంది. 2008 చివరిలో బిట్ కాయిన్ ప్ర‌స్థానం ప్రారంభ‌మైన‌ప్పుడు దాని విలువ కేవ‌లం కొన్ని సెంట్లు మాత్ర‌మే. 2013లో తొలిసారి 1000 డాల‌ర్ల‌కు దూసుకెళ్లినా.. ప‌లు దేశాల ప్ర‌భుత్వాలు దాని వినియోగాన్ని నిషేధించ‌డంతో బిట్ కాయిన్ విలువ భారీగా ప‌త‌న‌మైంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo