హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా-2025 సదస్సు లోగోను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం సచివాలయంలో ఆవిషరించారు. ఫిబ్రవరి 24-26 తేదీల్లో హైటెక్స్‌లో నిర్వహించే ఈ అంతర్జాతీయ సదస్సులో 50 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు.
లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సాంకేతిక రంగాల్లో వస్తున్న పరిణామాలను పునర్నిర్వచించే విధానాలపై చర్చలు జరుగుతాయని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏటా లైఫ్ సైన్సెస్ రంగంపై బయో ఏషియా అంతర్జాతీయ వార్షిక సదస్సు నిర్వహించడం ఆనవాయితీ. వచ్చే ఏడాది సదస్సు 22వది. మరోవైపు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో స్వీడన్‌కు చెందిన లైఫ్ సైన్సెస్ రంగానికి చెందిన ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను అన్వేషించాలని, ప్రభుత్వంతో కలిసిరావాలని మంత్రి వారికి సూచించారు.