న్యూఢిల్లీ, డిసెంబర్ 14: పెట్టుబడులను ఆకర్శించడంలో డాటా సెంటర్లు దూసుకుపోతున్నాయి. 2027 నాటికి డాటా సెంటర్ల విభాగంలోకి 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని సీబీఆర్ఈ అంచనావేస్తున్నది. అలాగే డాటా సెంటర్ల కెపాసిటీ 2070 మెగావాట్లకు చేరుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం 1,255 మెగావాట్ల స్థాయిలో ఉన్న డాటా సెంటర్ల సామర్థ్యం..ఈ ఏడాది చివరినాటికి 1,600 మెగావాట్లకు చేరుకుంటుందని తెలిపింది. గడిచిన ఆరేండ్లలో 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్శించిన దేశీయ డాటా సెంటర్ల విభాగం..వచ్చే మూడేండ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని సీబీఆర్ఈ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ప్రస్తుతం 19 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో డాటా సెంటర్లు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాది చివరినాటికి ఇది 31 మిలియన్ చదరపు అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నదని పేర్కొంది. అలాగే 475 మెగావాట్ల డాటా సెంటర్లు నిర్మాణ దశలో ఉన్నాయని, వచ్చే కొన్ని నెలల్లో ఇవి అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపింది. బీఎఫ్ఎస్ఐ, టెక్నాలజీ, టెలికం రంగాల నుంచి డాటా సెంటర్లకు డిమాండ్ ఉంటుందని తెలిపింది.
దేశీయ డాటా సెంటర్లలోకి అంతర్జాతీయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. వీటితోపాటు రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లు కూడా భారీగా నిధులుచొప్పించడానికి సిద్ధమవుతున్నాయి. డాటా సెంటర్ల నిర్వహణలో ముంబై తొలిస్థానం నిలిచింది. ఆ తర్వాతి క్రమంలో చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరులు ఉన్నాయి.