న్యూఢిల్లీ, మార్చి 12: ఎర్ర సముద్రంలో సంక్షోభం కొనసాగుతున్నది. నౌకలపై దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితుల్ని చూస్తే ఇప్పుడాప్పుడే ఆగేలా కనిపించడం లేదు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ సముద్ర జలాలపై వాణిజ్యం తీవ్రంగానే ప్రభావితం కావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) తాజా నివేదిక ప్రకారం ఎర్ర సముద్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిణామాలతో షిప్పింగ్ ఖర్చులు 40-60 శాతం పెరుగుతున్నాయి. సరకు రవాణా ఆలస్యం.. బీమా ప్రీమియం వ్యయాన్ని 15-20 శాతం పెంచుతున్నది. ఫలితంగా ఆయా సంస్థల లాభాలను తగ్గిస్తుండగా, ఎగుమతులను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 19న యెమన్ తీర సమీపంలో సరకు రవాణా నౌకలపై హౌతీలు దాడులు చేయడంతో ఈ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే.
ఈ ఖండాలపై దెబ్బ
ఎర్ర సముద్ర పరిణామాలు ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లోని పరిశ్రమలకు మింగుడుపడకుండా ఉన్నాయి. ముఖ్యంగా భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావమే పడుతున్నదని జీటీఆర్ఐ చెప్తున్నది. మిడిల్ఈస్ట్, ఆఫ్రికా, యూరప్ దేశాలతో భారత వ్యాపార సంబంధాలు ఇబ్బందుల్లో పడుతున్నాయని పేర్కొన్నది. ముడిచమురు, ఎల్ఎన్జీ దిగుమతులకు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిపైనే భారత్ ఎక్కువగా ఆధారపడుతున్నది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2022-23) 105 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురు దిగుమతులు (మొత్తం భారతీయ
వార్షిక ముడిచమురు దిగుమతుల్లో దాదాపు 65 శాతం) ఇరాక్, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి సూయెజ్ జలసంధి ద్వారానే భారత్‌కు వచ్చాయి. అలాగే ఆయా దేశాలకు ఈ జలసంధుల గుండానే సరకు రవాణా భారత్ నుంచి జరుగుతున్నది. యూరప్, ఉత్తర అమెరికాతో వ్యాపార వాణిజ్యంలో సుమారు 50 శాతం దిగుమతులు, 60 శాతం ఎగుమతులు (113 బిలియన్ డాలర్ల విలువైనవి) ఈ మార్గం ద్వారానే జరుగుతున్నాయి. దీంతో ఇక్కడి ఇబ్బందులు భారత్‌కు ఆర్థికంగా, భద్రతాపరంగా కూడా కొత్త చిక్కుల్నే తెచ్చిపెడుతున్నాయని జీటీఆర్ఐ విశ్లేషిస్తున్నది.
సరకు రవాణాపై ప్రభావం
రెడ్ సీలో సంక్షోభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్గించవచ్చన్న అంచనాలున్నాయి. 2022-23లో భారత్ నుంచి 451 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. అయితే ఈసారి 421 బిలియన్ డాలర్లకే పరిమితం కావచ్చని రిసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (ఆర్ఐఎస్) చెప్తున్నది. దీంతో 30 బిలియన్ డాలర్ల (రూ.2.50 లక్షల కోట్లు) వరకు పడిపోవచ్చని తెలుస్తున్నది. ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌకలకు హౌతీ మిలిటెంట్ల నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో కంటైనర్ షిప్పింగ్ రేట్లు అమాంతం పెరిగాయి. అంతేగాక ప్రయాణ ఖర్చులు, కంటైనర్లలోని సరకులకు సంబంధించిన బీమా ప్రీమియంలూ భారంగా తయారయ్యాయి. దీంతో ఎగుమతిదారులు వెనుకడుగు వేస్తున్నట్టు ఆర్ఐఎస్ డైరెక్టర్ సచిన్ చతుర్వేది చెప్తున్నారు. ఇప్పటికే భారతీయ ఎగుమతిదారులు 25 శాతం ఎగుమతుల్ని ఆపేసినట్టు దేశీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే నౌకలు దాదాపు 44 శాతం తగ్గాయని ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బ్రోకర్ క్లార్క్సన్ రిసెర్చ్ గుర్తుచేస్తున్నది. సరకు రవాణా సామర్థ్యం కూడా 40 లక్షల టన్నుల నుంచి 25 లక్షల టన్నులకు తగ్గిందంటున్నది.
భారత్‌కు నష్టమేమిటి?
హౌతీ తిరుగుబాటుదారుల దుశ్చర్యతో హిందూ మహాసముద్రంలో భాగమైన అరేబియా సముద్రం ద్వారా భారత్ నుంచి ఐరోపా, అమెరికా ఈస్ట్ కోస్ట్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు జరిగే వాణిజ్యం ఇబ్బందుల్లో పడింది. మెడిటరేనియన్ సముద్ర తీరంలోని ఆయా దేశాలకు బాబ్ ఎల్-మండేబ్ జలసంధి ద్వారా ఎర్ర సముద్రం మీదుగా సూయెజ్ జలసంధి నుంచే భారతీయ ఎగుమతులు చేరుతున్నాయి. అలాంటిది బాబ్ ఎల్-మండేబ్ జలసంధిపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులు జరుగుతుండటంతో ఆ మార్గంలో వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఈ రూట్‌కు ప్రత్యామ్నాయం.. కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి వెళ్లడమే. ఇలా వెళ్తే 6వేల కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. అదనంగా 10 రోజులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు మరో 10 లక్షల డాలర్లదాకా ఇంధన ఖర్చు అవుతుంది. ఈ క్రమంలో బీమా వ్యయం కూడా భారంగానే తయారవుతుంది. ఇక ఇదే మార్గం గుండా భారత్‌కు ముడి చమురు దిగుమతులూ జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే విజృంభించిన ద్రవ్యోల్బణం దేశంలో ఇంకా పెరుగుతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరుగుతోంది?
గాజాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతున్నది. ఆసియా, ఐరోపా దేశాల మధ్య వర్తక, వాణిజ్యానికి వీలుగా హిందూ మహాసముద్రం, మెడిటరేనియన్ సముద్రం నడుమ ఉండే దారే ఈ ఎర్ర సముద్రం. దీనికి ఒక చివరన సూయెజ్ జలసంధి ఉంటే.. మరో చివరన బాబ్ ఎల్-మండేబ్ జలసంధి. 30 కిలోమీటర్ల వెడల్పుండే ఈ బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలోనే నిరుడు నవంబర్‌లో కనీవినీ ఎరుగని రీతిలో హెలీక్యాప్టర్ నుంచి ఓ నౌకను హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మార్గం గుండా మార్స్, హపాగ్-లాయిడ్ వంటి అగ్రశ్రేణి షిప్పింగ్ కంపెనీలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపేశాయి. మరికొన్ని సంస్థలు తమ కంటైనర్ల ధరల్ని బాగా పెంచి నడిపించే ధైర్యం చేస్తున్నాయి. ఈ పరిణామం యావత్తు ఆసియా-ఐరోపా ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తున్నదిప్పుడు. ప్రపంచ వాణిజ్యంలో ఈ మార్గం గుండా జరిగే ఎగుమతి-దిగుమతుల వాటా 12 శాతంగా ఉన్నది. నిజానికి మొదట్లో ఇజ్రాయెల్ నౌకలనే హౌతీ రెబల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత అన్ని నౌకలపైనా క్షిపణులతో దాడులకు తెగబడుతున్నారు.
ఎర్ర సముద్రంలో ఏర్పడ్డ పరిస్థితులు ఆయా ఉత్పత్తుల కొరతకు దారితీస్తున్నాయి. దీంతో కంపెనీల లాభాలు పడిపోతున్నాయి. టెక్స్టైల్, తోలు పరిశ్రమలకూ సంక్షోభం సెగ తగులుతున్నది. భారతీయ దిగుమతులపైనేగాక, ఎగుమతులపైనా ప్రభావం పడుతున్నది. అయితే ఆటో రంగ సంస్థలు వివిధ రకాల రవాణా మార్గాలను ఎంచుకొంటూ కొంతమేర సమస్యల్ని అధిగమిస్తున్నాయి.
-అజయ్ శ్రీవాత్సవ్,జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు