హైదరాబాద్, ఫిబ్రవరి 14 : ప్రభుత్వానికి చెందిన విద్యుత్ పరికరాల సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ కంపెనీ నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ యూనిట్‌కు సంబంధించిన రూ.6,700 కోట్ల విలువైన ఆర్డర్ భెల్ దక్కించుకున్నది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ ప్రాజెక్టునకు సంబంధించి డిజైనింగ్, ఇంజినీరింగ్, తయారీ, సరఫరా, కమిషనింగ్తోపాటు సివిల్ వర్క్ చేయాల్సి ఉంటుందని భెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. మంచిర్యాల జిల్లాలో సింగరేణి సంస్థ నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల ఆదిలాబాద్ సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ఈపీసీ(ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) పద్దతిన నిర్మించాల్సివుంటుందని భెల్ పేర్కొంది. ఇప్పటికే సింగరేణికి చెందిన 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను భెల్ నిర్వహించింది.