Ola-Microsoft | భారత్లో క్యాబ్ సర్వీసులు అందించడంతోపాటు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారు చేస్తున్న ఓలా గ్రూప్.. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ ‘అజ్యూర్’ నుంచి తప్పుకున్నది. ఇక నుంచి తమ గ్రూప్ సంస్థ నిర్వహిస్తున్న కృత్రిమ్ ఏఐ క్లౌడ్ సేవలను వాడుకుంటామని ఓలా ఫౌండర్ భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇటీవల ఆయన చేసిన పోస్టును మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థ ‘లింక్డ్ ఇన్’ తొలగించడంతో ఈ ఘటన చోటు చేసుకున్నది.
ఇటీవల భవిష్ అగర్వాల్ తన గురించి తలుసుకోవడానికి లింక్డ్ ఇన్ ఏఐ చాట్ బోట్లో ‘భవిష్ అగర్వాల్’ ఎవరు?’ అని సెర్చ్ చేశారు. దీనికి చాట్ బోట్ ఇచ్చిన తప్పులను గుర్తించి దాని స్క్రీన్ షాట్ తీసి మళ్లీ లింక్డ్ ఇన్ ఖాతాలో పోస్ట్ చేశారు. గుడ్డిగా పాశ్చాత్య విధానాలు అనుసరిస్తే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ తమ విధి విధానాలకు విరుద్ధమని పేర్కొంటూ లింక్డ్ ఇన్ దాన్ని తొలగించింది. ఈ అంశంపైనా భవిష్ అగర్వాల్ పెట్టిన మరో పోస్టునూ లింక్డ్ ఇన్ డిలిట్ చేసింది. లింక్డ్ ఇన్ చర్యను తప్పు బట్టారు భవిష్ అగర్వాల్.. దీనికి ప్రతిగా మైక్రోసాఫ్ట్ సంస్థకు ఓలా గుడ్ బై చెప్పింది.