అమీర్‌పేట్, డిసెంబర్ 7 : మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నదని ఉపముఖ్యమంత్రి డాక్టర్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టెక్కీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళా సంఘాలచే రూపొందించిన ఉత్పత్తుల ప్రదర్శనను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డీ సీతక్కతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. సౌరశక్తి విద్యుత్ యూనిట్ మొదలు వస్త్ర, ఆహార, ఆరోగ్యం వంటి 17 విభాగాలకు చెందిన 70 పైగా స్టాళ్లు కొలువుదీరాయి.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తలు రూపొందిస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నదని, ఇందుకోసం ప్రతి యేటా వడ్డీ లేని రుణంగా రూ.20 వేల కోట్ల ఆర్ధిక చేయూతను మహిళల కోసం వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ విధంగా వచ్చే ఐదేండ్లలో రూ.లక్ష కోట్లతో రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఆర్ధిక ప్రగతి బాటలో పయనించి కోటీశ్వరులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ప్రకృతి సహజమైన వస్తువుల వినియోగంతో మహిళలు రూపొందించిన ఈ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొన్నదని, మహిళలు ఈ తరహా ఉత్పత్తుల తయారీని మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం ద్వారా అందివస్తున్న వడ్డీలేని రుణాలను అందిపుచ్చుకోవాలని, తాము ఉపాధి పొందుతూ మరింత మందికి ఉపాధి కల్పిస్తున్న తీరు ఆదర్శమని సీతక్క చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బండ్రు శోభారాణి, ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కల్వ సుజాత హాజరయ్యారు.