న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారతీ ఎయిర్టెల్ తమ డీటీహెచ్ వ్యాపారాన్ని విలీనం చేసే దిశగా వెళ్తున్నది. టాటా ప్లేతో భారతీ టెలీమీడియా ఆధ్వర్యంలోని ఎయిర్టెల్ డిజిటల్ టీవీని షేర్ల మార్పిడి డీల్ ద్వారా కలపాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక టాటా ప్లే వ్యాపార కార్యకలాపాలు సైతం ఒత్తిడిలోనే ఉండగా, అందుకే ఈ ఒప్పందం అనంతరం ఏర్పడబోయే కొత్త సంస్థలో ఎయిర్‌టెల్‌కు 52-55 శాతం వాటా, టాటా ప్లే భాగస్వాములైన టాటా సన్స్, వాల్ట్ డిస్నీలకు 45-48 శాతం వాటా ఉంటుందని సమాచారం.
కాగా, ఈ డీల్ తమ టెలికం, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్‌ల వ్యాపారాల వృద్ధికి దోహదం చేస్తుందని ఎయిర్టెల్ బలంగా నమ్ముతున్నది. మొత్తానికి ఇటీవలే రిలయన్స్, డిస్నీ స్టార్ ఇండియా-వయకామ్18 విలీనమై దేశీయ అతిపెద్ద మీడియా కంపెనీ జియోస్టార్ను తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, టాటా ప్లే విలీనం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. ఇది కుదిరితే భారతీయ డీటీహెచ్ రంగంలో మరో భారీ విలీనం చోటు చేసుకోవడం ఖాయమనే చెప్పాలి.
మొన్నటిదాకా ఓ వెలుగు వెలిగిన డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) వ్యాపారం ఇప్పుడు మసకబారిపోయింది. ఇందుకు కారణం ఓటీటీ (ఓవర్-ది-టాప్) ట్రెండ్ పెరిగిపోవడమే. నానాటికీ పెరుగుతున్న స్మార్ట్‌టీవీల అమ్మకాలకు తగ్గట్టుగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లూ పెరిగిపోతున్నాయి. దీంతో సంప్రదాయ డీటీహెచ్ సేవలకు పెద్దగా గిరాకీ లేకుండాపోయింది.
ఇంటర్నెట్ ప్యాకేజీలోనే ఆయా ఓటీటీల సబ్స్క్రిప్షన్ కలగలసి రావ డం, డీటీహెచ్ ప్లాన్లతో పోల్చితే ధరలు తక్కువగా ఉండటంతో అంతా బ్రాడ్‌బ్యాండ్ వైపే మొగ్గు చూపుతున్నారు. కొత్తగా విడుదలైన సినిమాలు థియేటర్ల నుంచి నేరుగా ఓటీటీల్లోకి వస్తుండటం, వీటికి వెబ్‌సిరీస్‌లు కూడా జోడవడంతో ఎంటర్టైన్మెంట్కు కొదవే లేకుండా పోయింది. పైగా నచ్చిన టెలివిజన్ చానళ్లనూ చూసుకునే వెసులుబాటు ఉండటంతో అంతా డీటీహెచ్‌లకు గుడ్‌బై చెప్పి బ్రాడ్బ్యాండ్కే జై కొడుతున్నారు.
గత కొన్నేండ్లలో దేశవ్యాప్తంగా 12 కోట్ల నుంచి 6 కోట్లకు డీటీహెచ్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య తగ్గిపోవడం ఇందుకు నిదర్శనం. 2020-21లో 7 కోట్లు గా ఉన్న డీటీహెచ్ వినియోగదారులు.. 2023 -24 (గత ఏడాది మార్చికల్లా)లో 6 కోట్లకు పడిపోయినట్టు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ గణాంకాలు చెప్తున్నాయి మరి. ఇప్పుడు ఇంకా తగ్గిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరిణామాలన్నీ కూడా డీటీహెచ్ ఆపరేటర్లను ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు, పోటీ సంస్థ ల్లో విలీనాల వైపు నడిపిస్తున్నాయి. చివరకు టాటా ప్లే సైతం బింజ్ పేరిట ఓటీటీ యాప్‌ను తీసుకొచ్చిందంటే మార్కెట్లో ట్రెండ్ ఏ స్థాయిలో మారిందో అర్థం చేసుకోవచ్చు.
భారతీ టెలీమీడియా, టాటా ప్లే రెండింటికీ కేంద్ర ప్రభుత్వంతో లైసెన్స్ ఫీజు బకాయిల వివాదాలున్నాయి. భారతీ టెలీమీడియా రూ.5,580 కోట్లు, టాటా ప్లే రూ.3,628 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఈ క్రమంలో వీటి సెటిల్మెంట్, ఆ తర్వాత కంపెనీల ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా విలీనంపై ప్రభావం చూపవచ్చన్న అంచనాలున్నాయి. నిజానికి కరోనాకు ముందు టాటా ప్లే విలువ గరిష్ఠంగా 3 బిలియన్ డాలర్లు పలికింది. కానీ ఇప్పుడు 1 బిలియన్ డాలర్లకు దిగజారింది. ఇదే సమయంలో వ్యాపారం తగ్గి నష్టాలు పెరగడం, కొత్త ప్లాన్లు ఆకర్షణీయంగా ఉండకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తున్నది. ప్రస్తుతం టాటా ప్లేకు 1.9 కోట్ల కస్టమర్లున్నారు. మరో 5 లక్షల బ్రాడ్‌బ్యాండ్ యూజర్లూ ఉన్నారు. విలీనంతో ఎయిర్‌టెల్‌కు ఇది కలిసిరానున్నది.