Investments | ధంతేరాస్.. దీపావళి.. అక్షయ తృతీయ.. పర్వదినాలను పవిత్రమైన రోజులుగా భారతీయ వనితలు భావిస్తారు. ఈ మూడు సందర్భాల్లో బంగారం ఆభరణాల కొనుగోలుకు.. బంగారంపై పెట్టుబడికి ప్రాధాన్యం ఇస్తుంటారు. బంగారంతోపాటు స్టాక్స్‌లోనూ పెట్టుబడి వల్ల రిటర్న్స్ లభిస్తాయి. అయితే, బంగారంపై పెట్టుబడి లేదా బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని మహిళల నమ్మకం. కనుక ఈ ఏడాది దీపావళి- ధంతేరాస్ సందర్భంగా కూడా బంగారం కొనుగోలు చేస్తారు. అటువంటప్పుడు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడమా.. గోల్డ్ ఫండ్స్‌లో లేదా స్టాక్ మార్కెట్లోని షేర్లలో పెట్టుబడులు పెట్టడం మంచిదా.. ఏ ఆప్షన్ బెటర్ రిటర్న్స్ అందిస్తుందో ఓ లుక్కేద్దాం..
పండుగల వేళ భారతీయులు బంగారం ఆభరణాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. బంగారం అనేది భారత సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం. బంగారం కొనుగోలుకు పర్సనల్ ఎమోషన్స్ కూడా కారణం అవుతుంటాయి. అలా వ్యక్తిగత ఉద్వేగాలతో బంగారం కొంటే అనిశ్చితి, ఒడిదొడుకుల వేళ దాన్ని విక్రయించి నగదుగా మార్చుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంటుంది. కానీ స్టాక్ మార్కెట్లో మనం కొనుగోలు చేసిన ఈక్విటీలను విక్రయించి పెట్టుబడులను మన అవసరాలకు అనుగుణంగా మార్చేసుకోవచ్చు.
వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోలో భాగంగా బంగారం, ఈక్విటీ మార్కెట్లలోనూ పెట్టుబడులు పెట్టొచ్చు. ఇన్వెస్టర్లు తమ అవసరాలు, ఫ్యూచర్ టార్గెట్స్, పెట్టుబడుల టైం, రిస్క్ తీసుకునే కెపాసిటీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బంగారం లేదా ఈక్విటీ మార్కెట్లలో నిధుల మదుపుపై ఒక నిర్ణయానికి రావొచ్చు. దాంతోపాటు ఈక్విటీలు, బంగారంపై పెట్టుబడులు పెడుతున్న వేళ ద్రవ్యోల్బణం, ఎకనమిక్ గ్రోత్, నగదు లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఎక్కువ కాలం స్టాక్స్‌లో మదుపు చేయగలిగితే ఇన్ఫ్లేషన్ను దాటేసి బెటర్ రిటర్న్స్ అందిస్తాయి. మార్కెట్లలో ఒడిదొడుకులు, హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కోసారి స్టాక్‌మార్కెట్లు భారీగా పతనం అవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో మీ పెట్టుబడులు ప్రమాదంలో చిక్కుకోకుండా కొంత మొత్తం బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే నష్టాలను నివారించొచ్చు.
గత పదేండ్లలో స్టాక్ మార్కెట్లలో 11-14% లాభాలు వస్తే, బంగారంపై కేవలం ఆరు శాతం రిటర్న్స్ మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది గ్లోబల్ స్టాక్ మార్కెట్లు 20-25 % క్షీణించినా.. భారతీయ స్టాక్ మార్కెట్లు మాత్రం మూడు శాతమే నష్టపోయాయి. గ్లోబల్ మార్కెట్లకు భిన్నంగా దేశీయంగా బులియన్ మార్కెట్లో బంగారం 1 1 శాతం రిటర్న్స్ వచ్చాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్న నేపథ్యం, భౌగోళిక- రాజకీయ- ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే బంగారంపై పెట్టుబడులే ఆకర్షణీయ రిటర్న్స్ ఇచ్చేలా కనిపిస్తున్నది.
వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల కోసం పుత్తడిలో పెట్టుబడులు పెట్టొచ్చు. బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడానికి బదులు గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ సావరిన్ బాండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో నిధులు మదుపు చేస్తే, ఆర్థిక సంక్షోభాలు తలెత్తినప్పుడు మన పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల్లో నష్టం వాటిల్లకుండా గోల్డ్.. దానిపై పెట్టుబడులు చేయూతనిస్తాయి. పర్సనల్ వాడకానికి మాత్రమే బంగారం ఆభరణాలు కొనాలి. పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని చూస్తే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవాలని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ఇటీవల ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ఠ స్థాయి 7.41% నమోదైంది. పెట్టుబడుల మదుపుపై ద్రవ్యోల్బణం ప్రతికూల ప్రభావం చూపుతుంది. డబ్బు విలువ తగ్గిపోతూ ఉంటుంది. కనుక ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రిటర్న్స్ పొందాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్ లక్ష్యాలకు సరిపడా నిధులు సమకూర్చుకోగలుగుతారు.
దీర్ఘకాలంలో 10-12% రిటర్న్స్ ఇస్తున్న ఇన్వెస్ట్మెంట్ రూట్లలో ఈక్విటీ మార్కెట్లు ఒకటి. ఇన్వెస్టర్లు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమించడానికి, తమ సంపద పెంచుకునేందుకు స్టాక్స్‌ను పెట్టుబడి మార్గంగా ఎంచుకోవచ్చు. అయితే, బంగారం, స్టాక్స్‌లో పెట్టుబడి నిష్పత్తిని ముందే నిర్ణయించుకోవాలి. కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్ లక్ష్యాలతోపాటు ఆదాయ వనరులను బట్టి బంగారం, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలి. దీనిపై స్పష్టత కోసం అవసరమైతే ఆర్థిక రంగ నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుంది.