మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Aug 03, 2020 , 00:11:19

రాఖీ కానుక ఇలా..

రాఖీ  కానుక ఇలా..

ఓ సోదరికి తన సోదరుడు ఇచ్చే అత్యుత్తమ కానుక ఆర్థిక స్వేచ్ఛ. ఈ స్వాతంత్య్రాన్ని రాఖీ పండుగ రోజు అందిస్తే మరింత ఆనందం. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రక్షా బంధన్‌కు మీ అక్కాచెల్లెండ్లకు ఫైనాన్షియల్‌ గిఫ్ట్స్‌  ఇవ్వండిక.మీ సోదరి కోసం సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాను తెరువవచ్చు. అందులో ఆమె కోసం నగదు డిపాజిట్‌ చేయవచ్చు. దానివల్ల వడ్డీ ఆదాయం లభిస్తుంది. అంతేగాక ఆ నగదును తనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

ఎఫ్‌డీ లేదా ఆర్‌డీ

మీ సోదరి పేరుతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేయవచ్చు. సేవింగ్స్‌ ఖాతాలో కంటే ఎక్కువ రాబడి ఇందులో పొందవచ్చు. అలాకాకుండా నెలనెలా కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టాలనుకుంటే రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్‌డీ)ను చేసుకోవచ్చు.

సిప్‌ను ప్రారంభించండి

ఓ మ్యూచువల్‌ ఫండ్‌లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్‌ఐపీ లేదా సిప్‌) అనేది మీ సోదరికి మీరిచ్చే గొప్ప కానుకగా చెప్పుకోవచ్చు. మీకు వీలైనంత కాలం ఇందులో కొంత నిర్దిష్ట మొత్తాన్ని ఈక్విటీ లేదా రుణ నిధి రూపంలో పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. దీనిపై మీకు అవగాహన అంతగా లేనట్లయితే వెంటనే మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.

పసిడిపై పెట్టుబడులు

బంగారు నగలకు బదులుగా.. ఆ బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చు. మనలో చాలామంది పసిడిని నగలు, నాణేల రూపంలోనే కొంటాం. దాన్నే పెట్టుబడిగా కూడా భావిస్తాం. కానీ ఆభరణాలను కొన్నప్పుడు ఉన్న తయారీ ఖర్చులు, జీఎస్టీ వంటివి అమ్ముకున్నప్పుడు తిరిగి పొందలేం. అదే గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లో పెట్టుబడి పెడితే ఆ నష్టం ఉండదు. ఒక గోల్డ్‌ ఈటీఎఫ్‌ యూనిట్‌ అర గ్రాము 24 క్యారెట్ల బంగారానికి సమానం. వీటిని ఎక్సేంజీల్లో ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. మీ సోదరి పేరుపై ఈ పెట్టుబడులు పెట్టండి.logo