హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తేతెలంగాణ): యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్న పౌల్ట్రీ రంగం భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉందనే పరిస్థితులు నెలకొన్నాయని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బయాస్ పేర్కొన్నారు. ఇప్పటికే ఉపాధి రంగంగా విస్తరిస్తున్న పౌల్ట్రీ రంగంలోకి కొత్తగా వచ్చే యువత ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ రంగంలో అధిక లాభాలు పొందవచ్చని హైదరాబాద్ హెచ్ఐసీసీ కేంద్రంగా నిర్వహించిన పౌల్ట్రీ ఇండియా-2025 ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో ఆయన అన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభించిందని, ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎగ్జిబిషన్లో 5 ఎగ్జిబిటర్లు, 50 వేల మంది సందర్శకులు పాల్గొన్నారని చెప్పారు.
ఈ ఎక్స్పో నిర్వహణకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉదయ్‌సింగ్ బయాస్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ విస్తరణకు మంచి అవకాశాలున్నప్పటకీ, హెచ్ఎండీఏ నిబంధనలతో ఈ రంగంలోకి వచ్చేవారిపై పెనుభారంగా మారిందన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో కొత్తగా కోళ్ల ఫాం పెట్టడానికి పెట్టిన 40 ఫీట్ల రోడ్డు నిబంధనను ఎత్తివేసి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మాదిరిగా వ్యవసాయ అనుబంధ రంగంగా పౌల్ట్రీ పరిశ్రమను గుర్తించి, వ్యవసాయానికి వర్తింప చేసే విద్యుత్ టారీఫ్‌ను అందించాలని ఉదయ్‌సింగ్ బయాస్ విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధనలపై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుసుకొని తమ ఇబ్బందులను వెల్లడించనున్నట్టు ఆయన చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పౌల్ట్రీ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం అందిస్తే రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలో తెలంగాణ రాష్ట్రం చికెన్, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. అంతకుముందు బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ.. గుడ్డు వినియోగంలో కేంద్రం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, మాల్ న్యూట్రిషన్ విషయంలో గుడ్డు వినియోగం అవసరాన్ని గుర్తించి నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పేరుతో అనేక సబ్సిడీ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పౌల్ట్రీ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నప్పుడే ఈ రంగం మరింత పురోభివృద్ధి సాధించనుందని పేర్కొన్నారు.