Stock Market Crash : అమెరికన్ ఎకానమీలో ఆర్ధిక సంక్షోభం నెలకొంటుందనే భయాలతో అంతర్జాతీయ మార్కెట్ల పతనం ప్రభావం దేశీయ స్టాక్‌మార్కెట్‌పై పడింది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సోమవారం వరుసగా రెండో సెషన్లోనూ కుప్పకూలాయి. సెన్సెక్స్ ఓ దశలో ఏకంగా 2345 పాయింట్లు పతనమై 78636 పాయింట్లకు చేరగా, నిఫ్టీ 698 పాయింట్లు కోల్పోయి 24019 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
అన్ని రంగాల షేర్లూ నష్టపోతుండగా స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. పలు మల్టీబ్యాగర్ షేర్లు సైతం స్వల్ప పతనాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి దేశీ మార్కెట్లను దెబ్బతీసింది. అన్ని ప్రధాన రంగాల సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల షేర్లు కుప్పకూలాయి. అమెరికా జాబ్ డేటా నిరుత్సాహపరచడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రేటజిస్ట్ డాక్టర్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు.
జులైలో ఉద్యోగాల సంఖ్య పడిపోవడం, అమెరికా నిరుద్యోగిత రేటు 4.3 శాతం పెరగడంతో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటోందని, అది ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని అంచనా వేశారు. స్టాక్ మార్కెట్ నష్టాలతో ఒక్కరోజులోనే రూ.18 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
Read More :
Pen Theft | పెన్ను దొంగిలించాడని.. 3వ తరగతి విద్యార్థిని గదిలో బంధించి కొట్టారు