Gold Price Hike | అక్షయ తృతీయకు ముందు బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. పసిడి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి డిమాండ్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,050 పెరిగి రూ.99,450కి పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. వైశాఖ మాసంలో మూడో రోజున అక్షయ తృతీయగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ రోజున బంగారం, వెండి ధరలను కొనుగోలు చేస్తూ వస్తుంటారు. ఈ సారి ఈ నెల 30న అక్షయ తృతీయ వస్తున్నది. మరో వైపు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1100 పెరిగింది. తులం ధర రూ.99వేలకు చేరుకున్నది. ఈ ఏడాది బంగారం ధరలు తులానికి రూ.20,500 వరకు పెరిగింది. అంటే ఏకంగా కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 26శాతం ధరలు పైకి కదిలాయి. గతేడాది డిసెంబర్ 31న తులం బంగారం రూ.78,950 పలికింది. మరో వైపు వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి.
రూ.3500 పెరిగి కిలో ధర రూ.1,02,000కి చేరుకుంది. గత మూడువారాల్లో వెండి ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు వెండి కిలోకు రూ.98,500 పలికింది. అక్షయ తృతీయ రోజున పసిడికి భారీ డిమాండ్ ఉంటుందని వ్యాపారులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో ఉత్సాహం నెలకొన్నది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఒకశాతం తగ్గి.. ఔన్స్‌కు 3,311 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. ఆసియా మార్కెట్లో స్పాట్ సిల్వర్ ఔన్స్ 33.27 వద్ద ట్రేడవుతున్నది. లాభాల స్వీకరణకు దిగుతుండడంతో కామెక్స్‌లో బంగారానికి డిమాండ్ తగ్గింది. ఔన్స్‌కు 3310 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. అమెరికా, భారత్, జపాన్ వంటి దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగున్నాయన్న ఆశలు.. వాణిజ్య యుద్ధం భయాలు తొలుగుతున్న నేపథ్యంలో డిమాండ్ పడిపోతుందని ఎల్కేజీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్, కమోడిటీ అండ్ కరెన్సీ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది పేర్కొన్నారు.