TGGENCO | హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ఏర్పాటు చేయాల్సిన అతిపెద్ద బ్యాటరీ స్టోరేజీ పవర్ ప్లాంట్‌పై జెన్కో చేతులెత్తేసింది. (బిల్డ్-ఆపరేట్-ఓన్) పద్ధతిలో ఆ ప్లాంట్‌ను సొంతంగా ఏర్పాటు చేయాల్సిన జెన్కో పూర్తిగా అస్త్రసన్యాసం చేసింది. ఆ ప్లాంట్‌ను బడాబాబులకు అప్పగించించేందుకు టెండర్లను ఆహ్వానించింది. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ ప్లాంట్ ఏర్పాటుకయ్యే రూ.600 కోట్ల అంచనా వ్యయంలో 40% మొత్తాన్ని (రూ.240 కోట్లు) వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద అందజేస్తుంది. మిగిలిన 60% మొత్తాన్ని (రూ.360 కోట్లు) జెన్కో పెట్టుబడిగా పెడితే సరిపోతుంది. అయినప్పటికీ కేంద్ర సాయాన్ని అందిపుచ్చుకోకుండా ఆ ప్లాంట్‌ను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు జెన్కో రంగం సిద్ధం చేసింది. దీంతో కేంద్రం అందించే రూ.240 కోట్లు ప్రైవేట్ వ్యక్తులకు దక్కనున్నాయి.
విచిత్రమేమిటంటే ఈ ప్లాంట్‌లో నిల్వచేసే విద్యుత్తు జెన్కోదే. డిమాండ్ లేనప్పుడు జెన్కో నుంచి తక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలుచేసి ఈ ప్లాంట్‌లోని బ్యాటరీల్లో నిల్వచేస్తారు. డిమాండ్ పెరిగినప్పుడు ఆ విద్యుత్తును మళ్లీ జెన్‌కోకే విక్రయిస్తారు. ఈ ప్లాంట్ జీవితకాలాన్ని 25 ఏండ్లుగా నిర్ణయించారు. అంటే.. ఈ ప్లాంట్‌ను ఏర్పాటుచేసే ప్రైవేట్ సంస్థ 25 ఏండ్లపాటు జెన్కో నుంచి విద్యుత్తు కొనుగోలు చేసి, బ్యాటరీల్లో నిల్వ చేస్తుంది. ఆ విద్యుత్తునే మళ్లీ జెన్కోకు విక్రయించి సొమ్ము చేసుకుంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో వార్షిక టర్నోవర్ రూ.15 వేలకోట్ల పైమాటే. అలాంటి సంస్థ బ్యాటరీ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కేవలం రూ.360 కోట్లు పెట్టుబడిగా పెట్టలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై జెన్కోతోపాటు ప్రభుత్వం పునరాలోచించాలని విద్యు త్తు రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
బ్యాటరీ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాటును ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు టెండర్లు పిలవడం వెనుక భారీ కుంభకోణం ఉన్నదని, వీజీఎఫ్‌గా సమకూరే రూ.240 కోట్లతోపాటు జెన్కోకు చెందిన 70 ఎకరాల స్థలాన్ని అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర చేశారని, అందుకే ఉద్దేశపూర్వకంగా జెన్ను తప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. శంకర్‌పల్లిలో గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు కోసం గతంలో స్థల సేకరణ జరిపారు. కానీ, ఆ ప్లాంట్ ఏర్పాటులో ముందడుగు పడలేదు. జెన్కో నిర్లక్ష్యం వల్ల ఆ స్థలంలో ఇప్పటికే కొంత భాగం కబ్జాకు గురైంది. మిగిలిన స్థలంలో బ్యాటరీ స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే అదికూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీన్ని జెన్కో ఇంజినీర్లు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యాటరీ స్టోరేజీ పవర్ ప్లాంట్‌ను సొంతంగా జెన్కో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.