న్యూఢిల్లీ, మే 21: డెరివేటివ్స్, మైక్రోఫైనాన్స్, బ్యాలన్స్ షీట్ మోసంలో సంస్థకు చెందిన పలువురు ఉద్యోగుల ప్రమేయమే ఉందని ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డు అనుమానిస్తున్నది. ఈ క్రమంలోనే మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ఏజెన్సీలకు, రెగ్యులేటరీ అథారిటీలకు నివేదించాలని బ్యాంక్‌ను ఆదేశించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) చివరి త్రైమాసిక (జనవరి-మార్చి) ఆర్థిక ఫలితాలను ప్రకటించేందుకు బుధవారం బ్యాంక్ బోర్డు సమావేశమైంది. ఈ క్రమంలోనే బ్యాంక్ అంతర్గత ఆడిటింగ్ నివేదికల సమీక్షతోపాటు ఓ బయటి సంస్థ రిపోర్టు ఆధారంగా ఈ మోసంలో కొందరు ఉద్యోగులు కీలకంగా ఉన్నట్టు అనుమానిస్తున్నామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇండస్ఇండ్ బోర్డు చెప్పింది.
అలాగే ఈ లోపాలకు బాధ్యులైన ఉద్యోగుల జవాబుదారీతనంపైనా దృష్టి సారించామని పేర్కొన్నది. ఈ ఏడాది మార్చిలో డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అకౌంటింగ్ లోపాలను ఈ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనివల్ల జరిగిన నష్టం.. గత ఏడాది డిసెంబర్ నాటికి బ్యాంక్ నికర విలువలో దాదాపు 2.35 శాతానికి సమానంగా ఉండొచ్చని కూడా వెల్లడించింది. వెంటనే పీడబ్ల్యూసీతో బ్యాంక్ బ్యాలన్స్ షీట్‌పై దీని ప్రభావాన్ని కూడా అంచనా వేయించారు. ఫలితంగా వివిధ స్థాయిల్లో నెలకొన్న నిర్లక్ష్యం, తక్షణ చర్యలపైనా పీడబ్ల్యూసీ బ్యాంక్‌కు సూచనలు చేసింది. ఇక గత నెల ఏప్రిల్ 29న బ్యాంక్ సీఈవో సుమంత్ కత్పాలియా, డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానాలు రాజీనామా చేసిన సంగతి విదితమే.
ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో ఇండస్ఇండ్ బ్యాంక్ రూ.2,329 కోట్లు నష్టపోయింది. బ్యాంక్ చరిత్రలోనే ఈ స్థాయి నష్టం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో సంస్థ షేర్ విలువ 1.39 శాతం నష్టపోయి రూ.771.10గా ఉన్నది.