మొండి బకాయిల ఊబిలో భారతీయ బ్యాంకింగ్ రంగం కూలబడింది. గడిచిన పదేండ్లలో ఆయా బ్యాంకులు రైటాఫ్ చేసిన రుణాల విలువ రూ.12 లక్షల కోట్లపైనే మరి. పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోదీ సర్కారు చేసిన ఈ ప్రకటన.. దేశంలో బ్యాంకుల అవస్థలకు అద్దం పడుతున్నదిప్పుడు.
Right Off | న్యూఢిల్లీ, డిసెంబర్ 16: భారతీయ బ్యాంకింగ్ రంగం మెడకు నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ లేదా మొండి బకాయిలు) గుదిబండలా తయారయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రధానమైన వాణిజ్య బ్యాంకులు గత పదేండ్లలో వదిలించుకున్న ఎన్పీఏల తీరే ఇందుకు నిదర్శనం. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి ఏకంగా రూ.12 లక్షల కోట్లకుపైగా లోన్లను బ్యాంకర్లు రైటాఫ్ చేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు దేశీయ కమర్షియల్ బ్యాంకులు రూ.12.3 లక్షల కోట్ల రుణాలను ఖాతా పుస్తకాల నుంచి తొలగించినట్టు తాజాగా పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
గడిచిన ఐదేండ్లలో బ్యాంకుల్లో జరిగిన రైటాఫ్ల్లో అత్యధికం ప్రభుత్వ బ్యాంకులు చేసినవే కావడం గమనార్హం. ఏకంగా రూ.6.5 లక్షల కోట్ల లోన్లను ఎన్పీఏలుగా నిర్ధారించి ఖాతా పుస్తకాల నుంచి తీసేశాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం (2023-24) బ్యాంకు రుణాల్లో ఒక శాతం రైటాఫ్ల కిందికే పోయాయి. ఈ నేపథ్యంలోనే కొత్త రుణాల్లో ప్రభుత్వ బ్యాంకుల వాటా 51 శాతానికి పడిపోయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) ఇది 54 శాతంగా ఉన్నది. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరునాటికి ప్రభుత్వ బ్యాంకుల మొత్తం రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు 3.01 శాతానికి పెరిగాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఇవి 1.86 శాతమే.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. లోన్ రైటాఫ్ల్లో టాప్లో ఉన్నది. గత పదేండ్లలో ఎస్బీఐ తమ ఖాతా పుస్తకాల నుంచి తీసేసిన రుణాల విలువ రూ.2 లక్షల కోట్లుగా ఉన్నది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.94,702 కోట్లతో కొనసాగుతున్నది. కాగా, లోన్ రైటాఫ్ అంటే రుణాలను తీసుకున్నవారిని పూర్తిగా వదిలేయడం కాదని, వారి నుంచి రుణ బకాయిలను వసూలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి చెప్తున్నారు. రికవరీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. అయితే ఇచ్చిన రుణం, దానిపై వడ్డీ మొత్తాల్లో ఎంతో కొంతే చివరకు తిరిగొస్తుందని, కొన్ని కేసుల్లో బ్యాంకులు పెద్ద ఎత్తున నష్టపోయిన సందర్భాలూ ఉంటున్నాయని బ్యాంకింగ్ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టులు, డెట్ రికవరీ ట్రైబ్యునళ్లు, సెటిల్మెంట్లు ఇలా అనేక ఖర్చుల్ని బ్యాంకులు భరించాల్సి వస్తున్నదని కూడా గుర్తుచేస్తున్నారు.
సామాన్యులు, సగటు వేతన జీవులు, చిరు వ్యాపారులు రుణాల కోసం వెళ్తే లక్ష ప్రశ్నలతో, సవాలక్ష విచారణలు, పరిశీలనలు చేస్తున్న బ్యాంకులు.. కార్పొరేట్లకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. అడిగిందే ఆలస్యం కోట్ల రూపాయల్లో లోన్లను మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వాలు సైతం ఇందుకు వంత పాడుతున్నాయి. చివరకు తీర్చలేమని వారు చేతులెత్తేస్తే.. దివాలా ముసుగులో బ్యాంకర్లూ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నది. అవును.. బ్యాంకులు రైటాఫ్ పేరిట ఖాతా పుస్తకాలను క్లీన్ చేసుకుంటున్న రుణాల్లో బడా వ్యాపార, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు పొందిన రుణాలే ఎక్కువ మరి. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా తదితర కేసులే ఇందుకు ఉదాహరణ. బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని వీరంతా దేశం విడిచి పారిపోయిన సంగతి విదితమే. ఈ కేసులను సీబీఐ, ఈడీలు విచారిస్తుండగా.. విదేశీ కోర్టుల్లో న్యాయం కోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొన్నది.