Banks strike | బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాల నాయకులపై వేధింపుల పెరుగుదలకు నిరసనగా, బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు, వారి హక్కులు, ఉద్యోగ భద్రతపై దాడులకు నిరసనగా ఈ నెల 19 న బ్యాంకింగ్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు స్తంభించనున్నాయి.
బైపార్టీ సెటిల్మెంట్ అండ్ ఐడీ యాక్ట్ ఉల్లంఘన, సీఎస్బీ బ్యాంకులో వేతన సవరణకు నిరాకరణ, ఉద్యోగులు, బ్యాంకుల మధ్య సెటిల్మెంట్లను ఉల్లంఘిస్తూ ట్రాన్స్ఫర్ల ద్వారా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడటాన్ని నిరసిస్తూ సమ్మె చేస్తున్నారని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ నియామకాల వల్ల ఖాతాదారుల సొమ్ముకు, భద్రతకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బ్యాంకుల యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలతో ఉద్యోగాలతోపాటు వారి ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వెంకటాచలం తెలిపారు. అందు వల్లే తమ ఆందోళనను తెలిపేందుకు ఒకరోజు సమ్మె చేస్తున్నట్లు వెల్లడించారు. మూడో శనివారం (నవంబర్ 19) సమ్మె వల్ల బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించనున్నాయి. నవంబర్ 20న ఆదివారం కావడంతో ఏటీఎంల్లో క్యాష్ నిల్వలు నిండుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ), బ్యాంకుల యాజమాన్యాలతో తాము జరిపిన చర్చలు సంతృప్తికరంగా సాగలేదని ఏఐబీఈఏ పేర్కొంది.
సమ్మెకు బ్యాంకు సంఘాల యునైటెడ్ ఫోరం మద్దతు పలికింది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగ సంఘాల డిమాండ్లకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు యునైటెడ్ ఫోరం తెలిపింది. ఈ సమ్మెలో కింది స్థాయి ఉద్యోగులు పాల్గొంటున్నారు. కనుక నగదు డిపాజిట్లు, విత్ డ్రాయల్స్, చెక్ క్లియరెన్స్ వంటి సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడనున్నది. ఇప్పటికే బ్యాంకు ఆఫ్ బరోడా, పంజాబ్ సింధ్ బ్యాంక్ వంటి బ్యాంకులు తమ ఖాతాదారులకు సమాచారం ఇచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారు శుక్రవారం పనులు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. పూర్తి కాని పక్షంలో బ్యాంకింగ్ లావాదేవీలను వాయిదా వేసుకోవాలని సూచనలు వచ్చాయి.