Bank Strike | రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ నియామకాలకు స్వస్తి పలకాలన్న ప్రధాన డిమాండ్లతో బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు వచ్చేనెల సమ్మెకు దిగనున్నాయి. డిసెంబర్ నాలుగో తేదీ నుంచి 11 వరకూ బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరుగనున్నది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బ్యాంకుల్లో తగినంత శాశ్వత సిబ్బంది ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగాల ఔట్ సోర్సింగ్ వల్ల కింది స్థాయిలో నియామకాలు తగ్గించడంతోపాటు ఖాతాదారుల గోప్యత, వారి డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
ఇంతకుముందు ఒకటి, రెండు రోజులు బ్యాంకుల ఉద్యోగులంతా సమ్మె చేసేవారు. కానీ ఈ దఫా దశల వారీగా సమ్మెలో పాల్గొంటారని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. డిసెంబర్ 4న ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు.
డిసెంబర్ ఐదో తేదీన బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డిసెంబర్ 6న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు. ఏడో తేదీన యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగులు సమ్మె చేస్తారు. 11న ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు.