Enforcement Directorate-Fraud | ఆయన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అధికారి. ఆకర్షణీయ వేతనం కూడా వస్తుంది. కానీ, లాభార్జనపైన ద్రుష్టి పడింది. అందుకోసం బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించి మరీ డిపాజిటర్లు.. అందునా ఫిక్స్డ్ డిపాజిట్ల మనీ ట్రాన్స్ఫర్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ అందుకు అవసరమైన మనీ కోసం బ్యాంకులో కస్టమర్లు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు బ్రేక్ చేసి ఆ మనీ వాడేశారు. అందుకోసం రూ.52 కోట్లకు పైగా డిపాజిట్లను దారి మళ్లించారు.
దీనిపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. సదరు బ్యాంకు మాజీ అధికారి బెదాంశు శేఖర్ మిశ్రాపై హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. రూ.2.56 కోట్ల విలువైన స్థిరాస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేసింది. 2021-22లో వెలుగు చూసిన ఈ ఫ్రాడ్‌పై తొలుత కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.
ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ పరిధిలో గల ఖల్సా కాలేజీ ‘పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు’ శాఖలో పని చేస్తున్న బెదాంశు శేఖర్ మిశ్రా తన, సహచర ఉద్యోగుల ఐడీలను దుర్వినియోగం చేసి ఫిక్స్డ్ డిపాజిట్లు బ్రేక్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ సంగతి వెలుగు చూడటంతో 2022 నవంబర్‌లో ఆయన్ను బ్యాంక్ సస్పెండ్ చేసింది. బెదాంశు శేఖర్ మిశ్రా సైతం తాను బ్యాంకును, ఖాతాదారులను మోసగించి ఫ్రాడ్ చేశానని అంగీకరించాడు. ఆయన రూ.52,99,53,698 మేరకు నిధులు దారి మళ్లించాడని ఈడీ అభియోగం.