BOM | న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను పెంచిన మరుసటి రోజే ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)..గృహ, వాహన రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. ఈ రెండు రకాల రుణాలపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించిన బ్యాంక్..ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తివేసింది. దీంతో గృహ రుణాలపై వడ్డీరేటు 8.60 శాతం నుంచి 8.50 శాతానికి దిగిరాగా, వాహన రుణాలపై 20 బేసిస్ పాయింట్లు తగ్గడంతో రుణ రేటు 8.70 శాతానికి దిగొచ్చింది.
తగ్గించిన వడ్డీరేట్లు సోమవారం నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. రుణ గ్రహీతలకు రెండు రకాలుగా ప్రయోజనాలు లభించనున్నాయని, ఒకవైపు వడ్డీరేట్లు తగ్గడం, మరోవైపు ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేయడంతో ఆర్థికంగా దోహదం చేసినట్లు అవుతున్నదని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల బ్యాంక్ విద్యా, బంగారం రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేసిన విషయం తెలిసిందే.