న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) అంచనాలకు మించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,014 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,493 కోట్ల లాభంతో పోలిస్తే 35 శాతం ఎగబాకినట్టు బ్యాంక్ వెల్లడించింది.
సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.7,711 కోట్ల నుంచి రూ.8,693 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.6,731 కోట్ల నుంచి రూ.7,755 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. గత త్రైమాసికంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.74 శాతం నుంచి 1.45 శాతానికి దిగొచ్చాయని పేర్కొంది. అలాగే నికర ఎన్పీఏ కూడా 0.18 శాతం నుంచి 0.13 శాతానికి తగ్గాయి.