హైదరాబాద్, డిసెంబర్ 14: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)..రాష్ట్రంలో వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే మార్చి నాటికి ఐదు జిల్లాల్లో కొత్తగా 9 శాఖలను ప్రారంభించాలనుకుంటున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏబీ విజయకుమార్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 38 శాఖలు ఉండగా, వీటిలో ఒక్క హైదరాబాద్లోనే 19 శాఖలను నిర్వహిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తున్నదని, ముఖ్యంగా వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కూడా సమకూరుస్తున్నదని ఆయన చెప్పారు. హైదరాబాద్ జోన్ రూ.12,121 కోట్ల వ్యాపారం సాధించిందని, గతేడాదితో పోలిస్తే ఇది 50 శాతం అధికమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 150 శాఖలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంక్..వీటిలో ఇప్పటి వరకు 86 శాఖలను ఆరంభించింది.
వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంక్
రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది బీవోఎం. రిటైల్ బొనాంజా-ఫెస్టివ్ ధమాకా ఆఫర్లో భాగంగా గృహ, వాహన రుణాలపై వడ్డీరేటును 40 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ రుణంపై వడ్డీరేటు 6.40 శాతానికి(గతంలో 6.80 శాతం), వాహన రుణంపై వడ్డీరేటు 6.80 శాతం(గతంలో 7.05 శాతం)కు తగ్గించింది. ఇప్పటికే బ్యాంక్ బంగారం, గృహ, వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసిన విషయం తెలిసిందే.