Bank of Baroda | సొంతిల్లు కొనుగోలు చేయాలని చూసేవారికి బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) శుభవార్త అందించింది. ఇంటి రుణాలపై వడ్డీరేటులో 25 బేసిక్ పాయింట్లు తగ్గిస్తూ 6.50 శాతానికి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6.75 శాతం వడ్డీపై ఇంటి రుణాలు లభించేవి. కనుక త్వరలో ఇంటి రుణం తీసుకోవాలనుకునే వారు బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖల్లో సంప్రదించవచ్చు. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. వచ్చే జూన్ 30 వరకు 6.50 శాతం వడ్డీరేటుపై ఇండ్లరుణాలు మంజూరు చేస్తుంది బీవోబీ. అంతే కాదు ప్రాసెసింగ్ ఫీజు కూడా వందశాతం మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రుణాలు తీసుకునే వారికి, బ్యాలెన్స్ రుణాల బదిలీకి ఇది వర్తిస్తుంది.
కొన్ని నెలలుగా సొంతిండ్ల కొనుగోళ్లు గణనీయంగా పెరుగడం మనం చూడొచ్చు. పూర్తిగా ప్రాసెసింగ్ ఫీజు రద్దుతోపాటు 6.50 శాతం వడ్డీరేటుపైనే ఇండ్ల రుణాలివ్వడం ద్వారా సొంతింటి కొనుగోలుదారులకు మరికొంత కాలం రాయితీ కొనసాగించదలిచాం. సొంతింటి కల సాకారం చేసుకునే వారికి చాలా ఆకర్షణీయ ఆఫర్‌గా ఉంటుంది అని బ్యాంక్ ఆఫ్ బరోడా మార్టగేజెస్ అండ్ రిటైల్ అసెట్స్ జనరల్ మేనేజర్ హెచ్‌టీ సోలంకీ తెలిపారు.
గతేడాది అక్టోబర్ 7 నుంచి 6.50 శాతంపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఇండ్ల రుణాలిస్తున్నది. గత నెల 31 వరకు ఈ ఆఫర్ కొనసాగింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 6.75 శాతం వడ్డీరేటు అమలు చేస్తున్నది. కానీ, సొంతిండ్లకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని తాజాగా మళ్లీ వడ్డీరేటును 6.50 శాతానికి తగ్గించేసింది.