న్యూఢిల్లీ, జూన్ 10: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా వడ్డీరేట్లను పెంచేసింది. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను అరశాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బీవోబీ తన ఎంసీఎల్ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు)ని 10-20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ వడ్డీరేట్లు ఆదివారం(జూన్ 12) నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణ రేటు 6.60 శాతం నుంచి 6.80 శాతానికి చేరుకోనుండగా, అలాగే నెల రుణాలపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు సవరించడంతో 7.05 శాతం నుంచి 7.20 శాతానికి చేరుకున్నది. మూడు, ఆరు, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో వరుసగా రేట్లు 7.25 శాతానికి, 7.35 శాతానికి, 7.50 శాతానికి చేరుకున్నాయి. మరోవైపు, ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులతోపాటు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కూడా వడ్డీరేట్లను పెంచాయి.