న్యూఢిల్లీ, మే 6: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) గృహ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును ఒకేసారి 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నది. ఈ తగ్గింపు కొత్తగా గృహ రుణాలు తీసుకునేవారికి వర్తించనున్నదని పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో వేతన జీవులు తీసుకునే రూ.15 లక్షలకు పైగా గృహ రుణాలపై వడ్డీరేటు 8 శాతంతో ప్రారంభంకానున్నాయి. గరిష్ఠంగా 9.50 శాతం వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. వారి క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీరేట్లను నిర్ణయించనున్నట్టు, అలాగే ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఫీజులపై డిస్కౌంట్‌ను కల్పిస్తున్నది. ఇప్పటికే బ్యాంక్ రెపో రేటుతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును తగ్గించిన విషయం తెలిసిందే.
అలాగే మహిళా రుణగ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల రాయితీని కల్పిస్తున్న బ్యాంక్..40 ఏండ్ల లోపు మహిళలు తీసుకునే గృహ రుణాలు, లోన్ ట్రాన్స్ఫర్ చేసుకునే వారికి 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియర్ తెలిపారు. గృహాలు కొనుగోలు చేసేవారికి తక్కువ వడ్డీకే రుణాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అలాగే గత నెలలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని కూడా సవరించింది. ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 8.15 శాతానికి, ఏడాది రుణాలపై 9 శాతంగా నిర్ణయించింది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌లు గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాయి.
బ్యాంక్ లాభం రూ.5,048 కోట్లు
బీవోబీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.5,048 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,886 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం 3 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.33,775 కోట్ల నుంచి రూ.35,852 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.92 శాతం నుంచి 2.26 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.68 శాతం నుంచి 0.58 శాతానికి దిగొచ్చాయి. మరోవైపు, 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1,38,089 కోట్ల ఆదాయంపై రూ.19,581 కోట్ల నికర లాభాన్ని గడించింది. అలాగే గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.8.35 డివిడెండ్‌ను బ్యాంక్ బోర్డు ప్రతిపాదించింది. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో బ్యాంక్ షేరు కుప్పకూలింది. మార్కెట్ ముగిసే సమయానికి 10.27 శాతం తగ్గి రూ.223.65 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ విలువ రూ.13,238.68 కోట్లు కరిగిపోయి రూ.1,15,657.52 కోట్లుగా నమోదైంది.