న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.5,238 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,253 కోట్ల లాభంతో పోలిస్తే 23 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.
సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.32,033 కోట్ల నుంచి రూ.35,445 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో వడ్డీల మీదనే రూ.30,263 కోట్లు సమకూరింది. క్రితం ఏడాది 3.32 శాతంగా ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ ఈసారికిగాను 2.50 శాతానికి తగ్గిందని, అలాగే నికర నిరర్థక ఆస్తులు లేదా మొండి బకాయిలు 0.76 శాతం నుంచి 0.60 శాతానికి దిగాయి. క్యాపిటల్ అడెక్వసీ రేషియో 16.26 శాతానికి పెరిగింది.