శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Mar 03, 2020 , 00:12:34

ద్విచక్ర వాహన విక్రయాలు డౌన్‌

ద్విచక్ర వాహన విక్రయాలు డౌన్‌
  • రెండంకెల స్థాయిలో పడిపోయిన
  • హీరో మోటోకార్ప్‌, బజాజ్‌, టీవీఎస్‌ మోటర్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ, మార్చి 2: ప్రముఖ ద్విచక్ర వాహనాలకు అమ్మకాల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. గత నెలలో హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటర్‌ల విక్రయాలు రెండంకెల స్థాయిలో పడిపోయాయి. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేయడం, మరోవైపు కరోనా వైరస్‌తో విడిభాగాల సరఫరాలో నెలకొన్న జాప్యం అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. మరోవైపు సుజుకీ మోటర్‌సైకిల్‌, రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ విక్రయాల్లో వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఫిబ్రవరి నెలలో హీరో మోటోకార్ప్‌ 4,98,242 యూనిట్ల వాహనాలను మాత్రమే విక్రయించింది. ఏడాది క్రితం ఇదే నెలలో విక్రయించిన 6,17,215 యూనిట్లతో పోలిస్తే 19.27 శాతం తగ్గాయి. వీటిలో మోటర్‌సైకిల్‌ సేల్స్‌ ఏడాది ప్రాతిపదికన 14.23 శాతం తగ్గి 4,79,310కి జారుకోగా, స్కూటర్‌ సేల్స్‌ 67.54 శాతం తగ్గి 18,932లకు పరిమితమయ్యాయి. కరోనా వైరస్‌తో టీవీఎస్‌ మొత్తం వాహన అమ్మకాలు 15 శాతం పడిపోయాయి. వీటిలో ద్విచక్ర వాహన విక్రయాలు 17.4 శాతం తగ్గుముఖం పట్టగా, త్రిచక్ర వాహన సేల్స్‌ మాత్రం 26 శాతం పెరిగాయి. వీటితోపాటు బజాజ్‌ ఆటో అమ్మకాలు కూడా ఏడాది ప్రాతిపదికన 10 శాతం తగ్గి 3,54,913లకు పడిపోయాయి. వీటిలో దేశీయ అమ్మకాలు 24 శాతం పడిపోయి 1,68,747లకు జారుకున్నాయి. ప్రీమియం బైకుల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ కేవలం ఒక్క శాతం వృద్ధితో 63,536ల అమ్మకాలు జరిపింది. 


logo