Ayodhya Ram Mandir Income | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. వార్షిక ఆదాయంపరంగా దేశంలో మూడో పెద్ద ఆలయంగా నిలిచింది. ఆలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటి నుంచి 13కోట్లమందికిపైగా భక్తులు, పర్యాటకులు అయోధ్యను దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయ వార్షిక ఆదాయం రూ.700కోట్లు దాటింది. వార్షిక ఆదాయం పరంగా రామ మందిరం స్వర్ణ దేవాలయం, శ్రీమాతా వైష్ణోదేవి, షిర్డీసాయిబాబా ఆలయాలను వెనక్కి నెట్టింది. ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అయోధ్య రామయ్య ఆలయం గణనీయంగా దోహదపడుతున్నది.
ప్రస్తుతం అయోధ్యలో భక్తులు, పర్యాటకుల సంఖ్య రెండు నుంచి ఐదు లక్షల మధ్య కొనసాగుతున్నది. ఈ క్రమంలో వచ్చిన వారికి సులభ దర్శనాలు కల్పించడం, వసతి కల్పించడం కాస్త సవాల్‌గా మారింది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. భారీగా ఆదాయం సమకూరుతున్న పది ప్రముఖ ఆలయాల జాబితాలో బాల రాముడి ఆలయం మూడో స్థానానికి చేరింది. నిత్యం వేలాది మంది రాముడిని దర్శించుకొని హుండీల ద్వారా నగదుతో పాటు బంగారం, వెండిని సైతం సమర్పిస్తుంటారు. ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ ఎకనామిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వినోద్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఒక అధ్యయనం, అంచనా ప్రకారం.. 2024-25 సంవత్సరంలో ఏపీలోని తిరుమల వేంకటేశ్వర ఆలయం వార్షిక విరాళాల మొత్తం సుమారు రూ.1500 నుంచి రూ.1650 కోట్లుగా అంచనా.
ఆ తర్వాత రెండోస్థానంలో కేరళ తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం ఉన్నది. ఆలయ వార్షిక ఆదాయం రూ.750 నుంచి రూ.850కోట్లుగా ఉన్నది. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రామ్నగరికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ కుంభమేళా నేపథ్యంలో లక్షలాది మంది అయోధ్యకు తరలివస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు లక్షల మంది వరకు రాముడిని దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి నుంచి భక్తుల తాకిడి కొనసాగుతున్నది. ఆలయ ట్రస్ట్ కార్యాలయం ఇన్చార్జి ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. ట్రస్ట్ పది విరాళాల కౌంటర్లలో ప్రతిరోజూ రూ.పది లక్షల విరాళాలు వస్తున్నాయని తెలిపారు.
అంచనా ప్రకారం.. మహాకుంభమేళా జరుగుతున్న నెలలోనే.. రూ.15కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లుగా పేర్కొన్నారు. దేశంలోని అత్యధికంగా ఆదాయం వచ్చే ఆలయ జాబితాలో తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం రూ.1500-రూ.1650కోట్లతో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం రూ.750-850కోట్ల ఆదాయం వస్తున్నది. పంజాబ్‌లోని రూ.650కోట్లతో స్వర్ణదేవాలయం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి రూ.600కోట్లు, మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి రూ.500కోట్లు, ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయానికి రూ.150 కోట్లు, ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్‌కు రూ.200-250కోట్లు, గుజరాత్ సోమ్‌నాథ్ ఆలయానికి రూ.150-200కోట్ల ఆదాయం వస్తున్నట్లుగా అంచనా.