ప్రతీ సంస్థ నిర్వహణ వెనుక అనేక సవాళ్లు దాగుంటాయి. ముఖ్యంగా భిన్న ప్రాంతాలకు చెందిన ఎన్నో విభిన్న మనస్తత్వాలు కలిసి పనిచేస్తుంటాయి. ఈ ఉద్యోగులందరి మధ్య సమన్వయం అనేది అంత సులువేమీ కాదు. ఈ విధిని సమర్థవంతంగా నిర్వర్తించడంపైనే సంస్థ విజయం ఆధారపడి ఉన్నది. ఇక సంస్థ పెరుగుతున్నకొద్దీ విలీనాలు-కొనుగోళ్లూ అనేవి అత్యంత సహజం. ఇలాంటప్పుడు మరో సంస్థకు చెందిన ఉద్యోగుల్నీ కలుపుకొనిపోవడం ఒక రకంగా కత్తిమీద సామే అని చెప్పవచ్చు.
ఎందుకంటే అప్పటికే ఉన్న ఉద్యోగులతో రకరకాల అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. వాటిని అధిగమిస్తేనే సదరు సంస్థ మరో స్థాయికి పోగలదు. ఈ టాస్క్‌ను యాక్సిస్ బ్యాంక్ తెలివిగా పూర్తిచేసింది. సిటీ ఇండియా రిటైల్ బ్యాంకింగ్, రుణాలు, క్రెడిట్ కార్డులు, వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారాలను యాక్సిస్ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.11,603 కోట్ల ఈ డీల్ పూర్తవడం ఒకెత్తయితే.. తదనంతర పరిస్థితులను చక్కదిద్దడం మరో ఎత్తు. ఈ సవాల్‌ను ఎంప్లాయ్ ఫ్రెండ్లీ విధానాలతో బ్యాంక్ జయించింది.
దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్‌లో అప్పటికే లక్షకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సమయంలో సిటీ ఇండియా నుంచి దాదాపు మరో 3,200 మంది వచ్చి చేరారు. వీరందరికీ తగిన గుర్తింపు దక్కాలి. ఎవ్వరి మనసుల్నీ నొప్పించకుండా బాధ్యతల్ని పంచాలి. ఆయా విభాగాల్లో వారిని సర్దుబాటు చేయాలి. ఇందుకు యాక్సిస్ బ్యాంక్ ఎంచుకున్న మార్గం ‘GIG-A’. 2020లో కరోనా సమయంలో తెచ్చిన ఈ కార్యక్రమం ఇప్పటికీ బ్యాంక్‌లో అమల్లో ఉన్నది.
ఇది ప్రత్యామ్నాయ పని విధానాలను కల్పిస్తుంది. నిజానికి బ్యాంకింగ్ రంగంలో హైబ్రిడ్ వర్క్‌ను పరిచయం చేసింది యాక్సిసే. కస్టమర్లను నేరుగా కలవడానికి వీల్లేని ఉద్యోగులు వారానికి రెండుసార్లు ఆఫీసుకు వస్తే చాలు. అందుకే యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగుల్లో నేటికీ సుమారు 4,000 మంది ఇంటి దగ్గర్నుంచే తమ పనిని పూర్తి చేసుకుంటున్నారు.
మొత్తానికి ఉద్యోగులు సంతోషంగా ఉంటే.. పని వేగంగా, నాణ్యతతో జరిగిపోతుందనడానికి యాక్సిస్ బ్యాంక్‌లోని వాతావరణమే నిదర్శనం అని చెప్పవచ్చు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ విధానాలతోనే అది సాధ్యమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు.
దేశీయ సంస్థలో ఓ విదేశీ సంస్థ కలిసిపోవడం వల్ల సాధారణంగానే సాంస్కృతిక వైరుధ్యాల సమస్య తలెత్తుతుంది. దీన్ని ఉద్యోగుల సహకారంతోనే జయించాలి. మా ఉద్యోగులు చాలాచాలా సహకరించారు. హైబ్రిడ్ వర్క్ విధానం కూడా కలిసొచ్చింది. ఇక ఉద్యోగుల ప్రతిభను గుర్తించి వారికి మెరుగైన శిక్షణను అందిస్తున్నాం. అన్ని విభాగాల్లో మహిళల్ని ప్రోత్సహిస్తున్నాం. పనితీరు ఆధారంగా పదోన్నతులు కల్పిస్తున్నాం. మెంటర్స్ సాయంతో సొంతంగా పనిచేసుకునేలా ఓ వ్యవస్థను నిర్మించాం.
– రాజ్‌కమల్ వెంపటి, యాక్సిస్ బ్యాంక్ హెచ్ఆర్ అధిపతి