Civil Aviation | 2022 నాటికి పౌర విమానయాన రంగం కోలుకుంటుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేసింది. బోస్టన్లో జరిగిన ఐఏటీఏ వార్షిక సమావేశంలో సంస్థ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే పౌర విమానయాన రంగం కోలుకుంటున్నదని చెప్పారు. గతేడాది 138 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూసిందన్నారు. ఇది 2021లో 52 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని తెలిపారు. 2022 నాటికి ఆ నష్టాలు మరింత తగ్గి 12 బిలియన్ డాలర్లకు పరిమితమవుతాయని అంచనా వేశారు.
2023లో పౌర విమానయాన రంగం పూర్తిగా లాభాల్లోకి వస్తుందని విల్లీ వాల్ష్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పౌర విమానయాన రంగం ఆదాయం 26.7 శాతం పెరిగి 472 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. ఇది 2009 నాటి స్థాయితో సమానం అని అన్నారు. వచ్చే ఏడాది ఈ పెరుగుదల 39.3 శాతంగా నమోదవుతుందని చెప్పారు.
వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో భారీ సంఖ్యలో విమానాలు నేలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికే పలు విమానయాన సంస్థలు నష్టాల్లోకి జాఆరుకున్నాయి. 2020-22 మధ్య ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం 201 బిలియన్ డాలర్ల నష్టాలు చవిచూసే అవకాశం ఉందన్నారు.