GST Mop-up | దేశీయంగా 2017 జూలై ఒకటో తేదీ నుంచి పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది సగటున రూ.1.66 లక్షల కోట్ల వసూళ్లు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభమైన సందర్భంగా లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ పై సంగతి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతి నెలా రూ.1.50 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లకు చేరాయన్నారు.
‘ 2017 జూలై ఒకటో తేదీ నుంచి ఏయేటికాయేడు జీఎస్టీ వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్ల వద్ద నిలుస్తున్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11 శాతం ఎక్కువ అని చెప్పారు.
ఈ ఏడాది సగటున రూ.1.50 లక్షల కోట్ల పై చిలుకు స్థూల జీఎస్టీ వసూళ్లు జరిగితే, 2022-23లో సగటున రూ.1.23 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని నిర్మలా సీతారామన్ తెలిపారు. సగటున ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు రూ.94,734 కోట్లు పెరిగాయన్నారు.
కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మరో ప్రశ్నకు సమాధానంగా చెబుతూ 2021-22లో 30 శాతం, 2022-23లో 22 శాతం స్థూల జీఎస్టీ వసూళ్లు పెరిగాయన్నారు. వ్యాపారులు స్వయం మదింపు ప్రకారం జీఎస్టీ చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ జీఎస్టీ చెల్లించకున్నా, తక్కువ చెల్లించినా సంబంధిత వ్యాపారులపై చర్య తీసుకునే ధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉంటుందని స్పష్టం చేశారు.