CEO-MD’s Pays hike in Corona | యావత్ మానవాళిని కరోనా మహమ్మారి వెంటాడినా.. లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు కొలువులు కోల్పోయినా.. వలస కార్మికుల నానా అగచాట్లు పడ్డా.. కార్పొరేట్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు (ఎండీ), సీఈవోలు మెరుగైన శాలరీలు పొందారు. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారతీయ కార్పొరేట్ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆయా సంస్థల యాజమాన్యాలు సగటున 13 శాతం (రూ.10.41 కోట్లు), అంతకంటే ఎక్కువ వేతనాలు పెంచేశాయి. అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకున్న వ్యాపారాన్ని ముందుకు నడిపించాలంటే తమ ఎండీలు, సీఈవోలను కొనసాగించాల్సి ఉంటుందని వాదించాయి.
2019-20 ఆర్థిక సంవత్సరం చివరి భాగంలో మొదలైన కరోనా మహమ్మారిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ విధించింది. తత్ఫలితంగా కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు కేవలం మూడు శాతమే పెరిగింది. ఈ నేపథ్యంలోనే 2020-21లో వారి వేతనాల్లో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదైంది. సీఈవోలు, ఎండీలు ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు పెరిగిన కార్పొరేట్ దిగ్గజాల్లో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా స్టీల్, లార్సెన్ & టర్బో, గోద్రేజ్ ప్రాపర్టీస్, అశోక్ లేలాండ్ ఉన్నాయి.
గత మార్చి నెలాఖరులో తమ ఎండీలు, సీఈవోలకు సగటు రూ.10.41 కోట్ల మేరకు చెక్ రూపంలో చెల్లించాయి. ఇదే 2019-20లో రూ.9.22 కోట్లు మాత్రమే. బీఎస్ఈ-200 కంపెనీల్లో 80 సంస్థల వేతనాలు, ఇతర భత్యాల చెల్లింపు డేటా ప్రకారం ప్రమోటర్లకు మినహాయింపు ఉన్నట్లు తెలుస్తున్నది. గతేడాది దేశవ్యాప్త లాక్డౌన్.. బిజినెస్ అంతరాయం పేరిట పలు కంపెనీలు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల్లో భారీగా కోత విధించాయి. బోనస్‌లు ఇతర అలవెన్స్‌లకు కత్తెరేశాయి.
ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం చివరిలో డిమాండ్ పుంజుకోవడంతో కార్పొరేట్ లాభాలు పురోభివ్రుద్ధి సాధించాయన్నారు. ఈ నేపథ్యంలో పలు రంగాల కంపెనీలు తమ వాటాదారులకు మంచి రిటర్న్స్ అందించాయని చెప్పారు. కరోనాతో తలెత్తిన అసాధారణ పరిస్థితుల్లో వివిధ సంస్థల సీఈవోలు మెరుగైన వేతనాల కోసం స్టార్టప్‌లు, న్యూ ఏజ్ బిజినెస్ రంగాల వైపు మళ్లిపోయారని తెలుస్తున్నది.