న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కార్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసిన ఆటోమొబైల్ సంస్థలు ప్రస్తుతం తగ్గించే పనిలో పడ్డాయి. వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాహన సంస్థలు ఒక్కోక్కటి తమ వాహన ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఇప్పటికే పలు సంస్థలు వాహన ధరలను తగ్గించగా..తాజాగా ఈ జాబితాలోకి మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, రెనో సంస్థలు చేరాయి. వీటిలో మహీంద్రా ధరలు వెంటనే అమలులోకి రాగా, రెనో, టయోటా ధరలు మాత్రం ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా తమ వాహన ధరలను రూ.1.56 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జీఎస్టీ ప్రయోజనాలను కొనుగోలుదారులకు బదలాయించాలనే ఉద్దేశంతో వాహన ధరలను దించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. నూతన ధరలు శనివారం నుంచే అమలులోకి వచ్చాయని పేర్కొంది. దీంతో బొలెరో రూ.1.27 లక్షల వరకు తగ్గనుండగా, ఎక్స్‌యూవీ3ఎక్స్వో(పెట్రోల్) రూ.1.4 లక్షలు, ఎక్స్‌యూవీ3ఎక్స్వో(డీజిల్) రూ.1.56 లక్షలు, థార్ 2డబ్ల్యూడీ(డీజిల్) రూ.1.35 లక్షలు, థార్ 4డబ్ల్యూడీ(డీజిల్) రూ.1.01 లక్షలు, స్కార్పియో క్లాసిక్ రూ.1.01 లక్షల వరకు దిగిరానున్నాయి.
Kwid
లక్ష వరకు తగ్గనున్న రెనో కార్లు
రెనో ఇండియా కూడా వాహన ధరలను లక్ష రూపాయల వరకు తగ్గిస్తున్నట్టు శనివారం ప్రకటించింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాలనే ఉద్దేశంతో వాహన ధరలను రూ.96,395 వరకు తగ్గించినట్టు కంపెనీ ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి తెలిపారు. దీంతో ఈ పండుగ సీజన్లో వాహన అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో క్విడ్ కారు రూ.55,095 తగ్గనుండగా, ట్రైబర్ రూ.80,195, కైగర్ రూ.96,395 చౌకగానున్నాయి.
Toyato
టయోటా కార్లు కూడా..
తమ వాహన ధరలను రూ.3.49 లక్షల వరకు కోత పెడుతున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రకటించింది. తగ్గించిన రేట్లు ఈ నెల 22 నుంచి అమలులోకిరానున్నట్టు పేర్కొంది. ఈ సందర్భంగా టయోటా వైస్ ప్రెసిడెంట్ వారిందర్ వాద్వా మాట్లాడుతూ.. జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలను కస్టమర్లకు అందించడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. దీంతో గ్లాంజా హ్యాచ్‌బ్యాక్ రూ.85,300 వరకు తగ్గనుండగా, టైజర్ రూ.1.11 లక్షలు, రుమియాన్ రూ.48,700, క్రైస్టా రూ.1.8 లక్షలు, హైక్రాస్ రూ.1.15 లక్షలు, ఫార్చ్యూనర్ రూ.3.49 లక్షలు, లెజెండర్ రూ.3.34 లక్షలు, హిలక్స్ రూ.2.52 లక్షలు, క్యామ్రీ రూ.1.01 లక్షలు, వెల్ఫైర్ రూ.2.78 లక్షల వరకు తగ్గనున్నాయి.