Gold | కుటుంబానికి శ్రేయస్సు, సంపదను తెచ్చి పెట్టే ధంతేరాస్, దీపావళి పండుగలు వైభవంగా జరుపుకునేందుకు ప్రజలంతా ముఖ్యంగా వ్యాపారులు సన్నద్ధం అవుతారు. ఈ పండుగల టైంలో బంగారం కొనుగోలు చేయడానికి పవిత్రమైన సమయం అని వ్యాపారులు, ప్రత్యేకించి గృహిణులు భావిస్తున్నారు. చాలా మంది ధంతేరాస్ రోజు బంగారం కొనుగోలుతో పెట్టుబడి ప్రారంభిస్తారు. ఒకవేళ కొనుగోలు చేసిన బంగారం ఫ్యూరిటీ లేకపోతే ఆందోళన పెరుగుతుంది. లో ప్యూరిటీ ఉంటే తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది. తక్కువ స్వచ్ఛత గల బంగారంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలివ్వవు. బంగారం క్యారట్లలో ఉంటుంది. క్యారట్లను బట్టి ప్యూరిటీ ఉంటుంది. 24 క్యారట్ల బంగారంతో పోలిస్తే 18 క్యారట్ల బంగారం ధరలో దాదాపు నాలుగోవంతు ( 25% ) తేడా ఉంటుంది.
ఉదాహరణకు 24 క్యారట్ల బంగారం ధర రూ.50,440 పలికితే, 18 క్యారట్ల బంగారం రూ. 37,829 లకు లభిస్తుందని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ పేర్కొంది. కనుక బంగారం కొనుగోలు చేయడానికి ముందు దాని ప్యూరిటీ, ధర తదితర ప్రాథమిక అంశాలను ధృవీకరించుకోవడం మర్చిపోవద్దని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధంతేరాస్ నాడు బంగారం కొనుగోలు చేయడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలివే..
ఎల్లవేళలా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) హాల్‌మార్క్ ఉన్న బంగారం మాత్రమే కొనగాలి. ప్యూరిటీ కోడ్, టెస్టింగ్ సెంటర్ మార్క్, జ్యువెలర్స్ మార్క్, మార్కింగ్ డేట్ చెక్ చేసుకోవాలి.
ప్రతి ఒక్కరూ బంగారం కొనుగోలు చేయడానికి జ్యువెల్లరీ దుకాణానికి వెళ్లినప్పుడు ఆ రోజు తులం బంగారం ధర ఎంత ఉందో క్రాస్ చెక్ చేసుకోవాలి. 24 క్యారట్లు, 22 క్యారట్లు, 18 క్యారట్ల బంగారం ధర వరలు చెక్ చేసుకోవాలి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్‌తోపాటు ఇతర మార్గాలు ధృవీకరించుకోవాలి.
బంగారం కొనుగోలు చేసేవారు క్యాష్ పేమెంట్ చేయడం పెద్ద తప్పు.. భీమ్ యాప్ వంటి యూపీఐ, డిజిటల్ బ్యాంకింగ్ చెల్లింపుల ద్వారా పే చేయడం మంచిది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా పే చేయాలి. బంగారం కొనుగోలుకు డబ్బు పే చేశాక బిల్లు తీసుకోవడం మరిచిపోవద్దు. ఒకవేళ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ప్యాకేజింగ్‌ను చెక్ చేసుకోవాలి.
నమ్మకమైన, విశ్వసనీయమైన జ్యువెలర్ వద్ద బంగారం కొనుగోలు చేయడం ద్వారానే ఎల్లవేళలా మోసాల నుంచి బయట పడొచ్చు. అటువంటి వ్యాపారులు మాత్రమే పన్ను వసూలు వంటి అంశాలకు కట్టుబడి ఉంటారు. బులియన్ వ్యాపారులేదైనా పొరపాటు చేస్తే బ్రాండ్ వాల్యూ పడిపోతుందని ఆందోళన చెందుతారు వ్యాపారులు.
చాలా మంది బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ మార్గంగానే భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేసేవారు దాని పూర్తి విలువపై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్టోర్స్ ఉద్యోగులతో బైబ్యాక్ పాలసీపై కూడా చర్చించాలి.
బంగారం ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు దాని మేకింగ్ చార్జీలు పరిగణనలోకి తీసుకోవాలి. జ్యువెల్లరీ మేకింగ్ చార్జిలు 3-25% మధ్య ఉంటాయి. ప్యూర్ గోల్డ్ కాయిన్లపై తక్కువ మేకింగ్ చార్జిలు ఉంటాయి. కొంత మంది స్వర్ణకారులు అద్భుతంగా ఆభరణాలు డిజైన్ చేసినప్పుడు 30శాతం మేకింగ్ చార్జీలు తీసుకుంటారు. అటువంటి వారి వద్ద బేరసారాలకు చాన్స్ కూడా ఉంటుంది.
ధంతేరాస్ నాడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్స్) ద్వారా డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, పేమెంట్స్ యాప్‌తో బంగారం కొనుగోలు చేయొచ్చు. డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం తప్పనిసరి. డిజిటల్ గోల్డ్ కొనుగోలు విషయంలో పారదర్శకంగా వ్యవహరించడంతోపాటు రియల్ టైమ్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి. ధరల్లో మార్పుల గురించి తెలుసుకోకపోతే విక్రయించాల్సి వచ్చినప్పుడు సరైన ప్రాఫిట్స్ పొందలేరు.