న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే ఏటీఎం ఛార్జీలు పెరగనున్నాయి. అనుమతించిన ఉచిత లావాదేవీలకంటే మించి ఏటీఎంలను ఉపయోగిస్తే జనవరి 1 నుంచి లావాదేవీకి రూ.21 చొప్పున (జీఎస్టీ అదనం) బ్యాంక్‌లు వసూలు చేస్తాయి. ఇప్పటివరకూ ఈ ఛార్జీ రూ.20గా ఉంది. అయితే ఖాతాదారులకు వారి స్వంత బ్యాంక్‌ల ఏటీఎం ద్వారా ఐదు ఉచిత లావాదేవీల అర్హత కొనసాగుతుంది. ఇతర బ్యాంక్‌ల ఏటీఎంల్లోనైతే..మెట్రో కేంద్రాల్లో మూడు, నాన్-మెట్రో కేంద్రాల్లో ఐదు లావాదేవీలు ఉచితం. కొత్త ఏటీఎంల ఏర్పాటు, ఏటీఎంల నిర్వహణ వ్యయాలు పెరిగినందున, బ్యాంకులు వాటి ఇంటర్‌ఛార్జ్ ఫీజును ఆర్థిక లావాదేవీకి రూ. 15 నుంచి రూ. 17కు, ఆర్థికేతర లావాదేవీకి రూ. 5 నుంచి రూ. 6కు 2021 ఆగస్టు నుంచి పెంచుకునేందుకు రిజర్వ్‌బ్యాంక్ అనుమతించింది. ఈ ఫీజులు పెరిగిన నేపథ్యంలో 2022 జనవరి 1 నుంచి ఏటీఎం లావాదేవీలపై ఛార్జీల పెంపుపై బ్యాంక్‌లకు ఆర్బీఐ అనుమతి లభించింది.