న్యూఢిల్లీ, మే 1: కొత్త ఏకీకృత పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నడూ లేనంతగా 2023 ఏప్రిల్‌లో రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ముగిసిన నెలలో రూ. 1.87 లక్షల కోట్లు వసూలైనట్టు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిరుడు ఏప్రిల్‌తో పోలిస్తే 12 శాతం వృద్ధిచెందాయి. గత రికార్డు వసూళ్లు 2022 ఏప్రిల్‌లోనే జరగడం గమనార్హం. ఆ నెలలో రూ.1.68 కోట్ల జీఎస్టీ పసూలయ్యింది. 2023 ఏప్రిల్‌లో జరిగిన మొత్తం రూ.1,87,035 కోట్ల వసూళ్లలో సీజీఎస్టీగా రూ.38,440 కోట్లు కాగా, ఎస్జీఎస్టీగా రూ.47,412 కోట్లు, ఐజీఎస్టీగా రూ.89.158 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ.34,972 కోట్లతో సహా) వచ్చాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వసూలైన మొత్తం వస్తు సేవల పన్ను రూ.18.10 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంకంటే 22 శాతం అధికంగా వచ్చినట్టు ఆర్థిక శాఖ తెలిపింది.
ముగిసిన ఏప్రిల్ నెలలో ఒక్క రోజులోనే అత్యధిక వసూళ్లు జరిగాయి. 2023 ఏప్రిల్ 20న 9.8 లక్షల లావాదేవీల ద్వారా రూ.68,228 కోట్ల వస్తు సేవల పన్నులు ఖాజానాకు సమకూరినట్టు ఆర్థిక శాఖ వివరించింది. గత ఏడాది ఏప్రిల్ 20న 9.6 లక్షల లావాదేవీలతో వచ్చిన రూ. 57,846 కోట్ల వసూళ్లే ఇప్పటివరకూ సింగిల్ డే రికార్డుగా ఉన్నది.
తెలంగాణ రాష్ట్రంలో 2023 ఏప్రిల్ నెలలో రూ. 5,622 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. నిరుడు ఇదే నెలలో జరిగిన రూ.4,955 కోట్లకంటే తాజాగా ముగిసిన నెలలో 13 శాతం జీఎస్టీ వసూళ్లు వృద్ధి చెందాయి.