కాలిఫోర్నియా, సెప్టెంబర్ 7: ఐఫోన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. కాలిఫోర్నియాలోని యాపిల్ క్యాంపస్, స్టీవ్ జాబ్స్ థియేటర్లో రెండేళ్ల తర్వాత ఐఫోన్ 14ను మార్కెట్లోకి విడుదల చేసింది సంస్థ. ఐఫోన్‌తో పాటు, యాపిల్‌వాచ్ 8, ఎయిర్ పాడ్స్ ప్రో2లను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్. భారత్‌లో త్వరలో 5జీ సర్వీసులు ప్రారంభం కానున్న దృష్ట్యా ఈ కొత్త ఫోన్లు, వాచ్‌లు మరింత ఆదరణ పొందే అవకాశముంది.
ఐఫోన్ 14 వివరాలు..
నాలుగు రకాల వేరియంట్లలో అందుబాటులోకి రానున్న కొత్త ఐఫోన్.. ఐఫోన్ 14, 14 ప్లస్, 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్లుగా నిర్ణయించింది. వీటిలో 6.1 అంగుళాల సైజులో 14, 14 ప్రో లభిస్తుండగా..14 ప్లస్, 14 ప్రో మ్యాక్స్ మాత్రం 6.7 అంగుళాల సైజులో రూపొందించింది. 14, 14 ప్లస్ ఫోన్లలో పాత ఏ 15 ప్రాసెసర్ వాడుతుండగా..ప్రో, ప్రో మ్యాక్స్‌లో సరికొత్త ఏ16 బయోనిక్ చిప్‌తో తయారు చేసింది సంస్థ. 48 మెగాపిక్సెల్ వైడ్‌యాంగిల్ సెన్సార్, 12 ఎంపీ కెమెరాను అమర్చారు. వీటిలో 14 ఫోన్ ధర 799 డాలర్లు(భారత్‌లో రూ.65 వేలు ఉంటుందని అంచనా), 14 ప్లస్ మోడల్ ధర 899 డాలర్లు(భారత్‌లో రూ.75 వేలు ఉంటుందని అంచనా)గా నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 14, వచ్చే నెల 9 నుంచి 14 ప్లస్ మోడళ్ళు మార్కెట్లో లభించనున్నాయి.
యాపిల్ వాచ్ 8
ఐఫోన్‌తో పాటు యాపిల్‌వాచ్ 8 కూడా విడుదల చేసింది సంస్థ. ఇందులో రెండు మోడళ్లు ఉన్నాయి. కొత్తగా మూడు సైజులు 41, 45, 49 మిల్లీమీటర్లలో కొత్త రకం డిజైన్లలో ఇవి విడుదల అవుతున్నాయి. వాచ్ 8, 8 అల్ట్రాగా విడుదల కానున్న యాపిల్ వాచ్‌లో శరీర ఉష్ణోగ్రతను కొలిచే సెన్సార్, అలాగే మహిళల కోసం ఉపయుక్తంగా ఉండే ఫీచర్స్‌తో రూపొందించింది. వీటిలో వాచ్8 ధర సుమారు రూ.45 వేలు కాగా, ప్రీమియం మోడల్ అయిన వాచ్ 8 అల్ట్రా రూ. 80 వేలుగా ఉంటుందని అంచనా.
ఇయర్ పాడ్స్ కూడా
ఇక మూడు సంవత్సరాల కిందటి ఇయర్‌పాడ్స్ ప్రో మరింతగా ఆధునీకరించి మార్కెట్లోకి విడుదల చేసింది యాపిల్ సంస్థ. వీటిలో ఆపిల్ లాస్‌లెస్ ఆడియో కొడెక్ను నిక్షిప్తం చేశారు. అలాగే ఇప్పుడున్నట్లు బయటకు పొడుగ్గా కనిపించే గొట్టంలాంటి డిజైన్ కాకుండా చెవిలో ఇమిడిపోయే రెక్కల్లా మార్చారు. ఈ నెల 23 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఇయర్‌పాడ్స్ ధరను 249 డాలర్లుగా నిర్ణయించింది.