Apple iPhone | న్యూఢిల్లీ, మే 16: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ను అమెరికాకు తెచ్చేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నం చాలాచాలా ఖరీదైనదిగానే కనిపిస్తున్నది. అవును మరి.. ట్రంప్ పుణ్యమాని యాపిల్‌కు ‘మేక్ ఇన్ యూఎస్’ కష్టాలు వచ్చిపడ్డాయిప్పుడు. భౌగోళిక, రాజకీయ వ్యూహాల దృష్ట్యా చైనా నుంచి భారత్‌కు తమ తయారీని మార్చాలనుకున్న అమెరికన్ కంపెనీ యాపిల్‌కు ట్రంప్ రూపంలో ప్రధాన అవరోధం ఏర్పడుతున్నది. అమెరికా సంస్థలు స్థానిక ఉత్పాదకతకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ అక్కడి కార్పొరేట్లపై గత కొద్ది రోజులుగా ప్రెసిడెంట్ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో యాపిల్ తల పట్టుకుంటున్నది.
యాపిల్ ఉత్పత్తులు ప్రస్తుతం 80 శాతం చైనాలోనే తయారవుతున్నాయి. దీనివల్ల అక్కడ దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలూ లభిస్తున్నాయి. అయితే గత కొన్నేండ్లుగా చైనా పరిస్థితులు తమకు ప్రతికూలంగా మారుతున్నాయని భావిస్తున్న కంపెనీలు.. ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే భారత్‌పై యాపిల్ దృష్టి సారించింది. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు మారిన అమెరికా అవసరాలు, ప్రాధాన్యాలు, లక్ష్యాల వల్ల యాపిల్ స్వదేశానికే రావాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. గురువారం ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్‌తో జరిగిన సంభాషణల్లోనూ ట్రంప్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. భారత్‌లో విస్తరణ ఆలోచనల్ని మానుకోవాలని కుక్కు ట్రంప్ సూచించారు. కానీ ఇది యాపిల్‌కు ఏమాత్రం ఇష్టం లేకుండా ఉన్నది. ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గితే భీకర నష్టాలు తప్పేలా లేవు.
యాపిల్ ఉత్పత్తుల్లో ప్రధానమైనది ఐఫోన్. ఇటీవలికాలంలో ఐఫోన్ అమ్మకాలు బాగా పెరుగుతూపోతుండగా, ఆసియా దేశాల్లోనైతే వీటి వినియోగం విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. దీంతో ఇన్నాళ్లూ మార్కెట్ లీడర్లుగా ఉన్న సామ్సంగ్ తదితర సంస్థలకు యాపిల్ గట్టి పోటీనిస్తున్నదిప్పుడు. అయితే యాపిల్ తమ ఉత్పత్తిని అమెరికా ప్రధాన కేంద్రంగా నడిపిస్తే.. ఐఫోన్ ధరలు పెరగడం ఖాయమన్న అంచనాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెయ్యి డాలర్లుగా ఉన్నది.. 3వేల డాలర్లకు చేరవచ్చని అంటున్నారు.
భారతీయ కరెన్సీలో ఐఫోన్ రేటు రూ.85,000 నుంచి ఏకంగా రూ.2.55 లక్షలకు చేరుతుంది. ఇదే జరిగితే యాపిల్ అమ్మకాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్, చైనా, వియత్నాం వంటి ఆసియా దేశాలతో పోల్చితే అమెరికాలో ఉత్పాదక వ్యయం చాలాచాలా ఎక్కువ. ఉద్యోగుల జీతాలు, ప్లాంట్ల నిర్వహణ ఖర్చులు, ముడి సరకు వ్యయం వంటివి అన్నీ పెరిగిపోతాయని ఎంసీసీఐఏ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ గిర్బనే అంటున్నారు. ఒకవేళ ట్రంప్ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇచ్చినా ఉత్పాదకత భారమేనన్న అభిప్రాయాలున్నాయి. అందుకే ట్రంప్ ప్రతిపాదనపై యాపిల్ అయిష్టంగానే ఉన్నది. టిమ్ కుక్ సైతం భారత్‌లో తమ నెట్వర్క్ విస్తరణ ఉంటుందనే చెప్తుండటం గమనార్హం.