హైదరాబాద్, మే 20: తెలంగాణలో మరో హోటల్‌ను నెలకొల్పడానికి సిద్ధమైంది ఐటీసీ గ్రూపు. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు హోటళ్లను నిర్వహిస్తున్న ఐటీసీ హోటల్స్..తాజాగా నగరానికి సమీపంలోని శంకర్పల్లి వద్ద హోటల్‌ను ఏర్పాటుచేయబోతున్నది. ‘వెల్కమ్హోటల్ శంకర్పల్లి’ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ హోటల్‌కోసం కేఏసీ పామ్ ఎక్సోటికా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జట్టుకట్టింది.
ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు మంగళవారం అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా ఐటీసీ హోటల్స్ ఎండీ అనిల్ చాదా మాట్లాడుతూ.. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు హోటళ్లను విస్తరిస్తున్నట్టు, దీంట్లోభాగంగా పర్యాటక కేంద్రమైన శంకర్‌పల్లిలో కొత్తగా హోటల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ హోటల్లో 155 గదులు ఉండనున్నాయి.