(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): బొగ్గు గనుల లీజు విషయంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్.. బొగ్గు విక్రయాల్లో కూడా అక్రమాలకు పాల్పడింది. నాణ్యతలేని బొగ్గును కారుచౌకగా కొనుగోలు చేసి దాన్ని హై-గ్రేడ్ క్వాలిటీ బొగ్గుగా నమ్మించి ఎక్కువ ధరకు విక్రయించింది. ఇలా ప్రభుత్వరంగ విద్యుత్తు కంపెనీ నుంచి దాదాపు రూ. 3 వేల కోట్లు దోచుకొన్నది. ఈ మేరకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ), అంతర్జాతీయ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ కథనాల్లో వెల్లడించింది.
అదానీ బొగ్గు అక్రమాలతో ప్రజలపై ఆర్థికభారం పడటమే కాదు, వారి ప్రాణాలు కూడా ప్రమాదంలో నెట్టబడ్డాయని పర్యావరణ నిపుణులు మండిపడుతున్నారు. నాణ్యతలేని బొగ్గుతో విద్యుదుత్పత్తి తక్కువగా జరుగుతుందని, అలాగే పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని ఆస్ట్రేలియాకు చెందిన ైక్లెమెట్ ఎనర్జీ ఫైనాన్స్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ టిమ్ బక్లే అన్నారు. దీంతో విద్యుత్తు ఛార్జీలు పెరిగి భారత్‌లోని పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ కాలుష్యం జరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని మండిపడ్డారు. గాలి కాలుష్యంతో ఏటా భారత్‌లో 20 లక్షల మంది మరణిస్తున్నారని లాన్సెట్ ఇచ్చిన నివేదికను ఈ మేరకు ఉదహరించారు.
అదానీ గ్రూప్ బొగ్గు అక్రమాలు ఇప్పటివి కాదు. ఎనిమిదేండ్లకిందటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ).. అదానీ సంస్థల అక్రమాలను గుర్తించింది. ఇండోనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటూ దేశంలో కృత్రిమ బొగ్గు కొరతను సృష్టిస్తున్నారని, దీన్ని విదేశాలకు ధనాన్ని తరలించే మార్గంగానూ మార్చుకుంటున్నారని అదానీసహా 40 దిగుమతిదారులకు 2016లో డీఆర్ఐ నోటీసులిచ్చింది. అసలు పోర్టుల్లో దిగుమతైన బొగ్గుకు చూపించిన ధరల్లో 50 శాతానికే కొంటున్నారని పేర్కొంది. ఈ బొగ్గుతో తయారైన విద్యుత్తును అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించింది. ఎక్కువ ధరకు విద్యుత్తును కొని ప్రజలు, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు నష్టపోతున్నాయని తేల్చిచెప్పింది. అయితే, డీఆర్ఐ దర్యాప్తును నిలిపేయాలంటూ బాంబే హైకోర్టు నుంచి అదానీ గ్రూప్ స్టే తెచ్చుకొన్నది. దీంతో డీఆర్ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం ఈ కేసు అటకెక్కింది.
2014లో ఇండోనేషియా నుంచి దాదాపు 69,925 మెట్రిక్ టన్నుల బొగ్గును అదానీ కంపెనీ కొనుగోలు చేసింది. ఇది నాణ్యతలేని బొగ్గు. ధర చాలా తక్కువ. అయితే, ఇదే బొగ్గును హై-గ్రేడ్ క్వాలిటీ బొగ్గుగా ధ్రువపర్చిన అదానీ కంపెనీ.. తమిళనాడులో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న టీఏఎన్జీఈడీసీవో విద్యుత్తు సంస్థకు మూడు రెట్లు ధర పెంచి విక్రయించింది. సంస్థను నమ్మించడానికి క్వాలిటీ చెక్ రిపోర్ట్‌ను కూడా మార్చివేసింది. ఇలా పలుమార్లు విక్రయాలు జరిగాయి. ఈ మేరకు ఓసీసీఆర్పీ, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికలో ఆరోపించాయి. కొన్ని ఇన్వాయిస్ పత్రాలను ఈ సందర్భంగా విడుదల చేశాయి. ఒక్కో టన్ను బొగ్గుకు 92 డాలర్లను అదానీ కంపెనీ ఛార్జీ చేసినట్టు పేర్కొన్నాయి. ఇలా 2014-2016 మధ్య అదానీ కంపెనీ కారణంగా టీఏఎన్జీఈడీసీవో సంస్థకు మొత్తంగా రూ. 3 వేల కోట్ల మేర నష్టంవాటిల్లినట్టు 2018లో అరప్పూర్ అయక్కమ్ అనే ఎన్జీవో సంస్థ ఆరోపించిన విషయాన్ని ఓసీసీఆర్పీ ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఒక్క 2014లోనే కాదు ఆ తర్వాత కూడా ఇలాంటి మోసాలకు అదానీ గ్రూప్ పాల్పడి ఉండవచ్చని ఓసీసీఆర్పీ అనుమానాలు వ్యక్తం చేసింది. కాగా, నిరుడు హిండెన్‌బర్గ్ ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన అదానీ గ్రూప్‌నకు.. తాజా ఆరోపణలు మరో మరకేనని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా తాజా నివేదికను అదానీ గ్రూప్ ఖండించింది. తమ విక్రయాలు పారదర్శకంగానే జరిగినట్టు చెప్పుకొచ్చింది. ఇదిలాఉండగా బొగ్గు గనుల లీజుల విషయంలో అదానీ గ్రూప్‌నకు కేంద్రంలోని మోదీ సర్కారు మేలు చేసేలా వ్యవహరించిందన్న విమర్శలు ఇప్పటికే ఉండటం తెలిసిందే.