Telecom Subscribers | న్యూఢిల్లీ, నవంబర్ 21: ప్రైవేట్ టెలికం దిగ్గజాలకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. టారిఫ్‌లను పెంచిన నాటి నుంచి వరుసగా మొబైల్ సబ్‌స్ర్కైబర్లను కోల్పోతున్న రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు సెప్టెంబర్ నెలలోనూ ఏకంగా కోటి మంది వైర్లెస్ సబ్‌స్ర్కైబర్లు కోల్పోయారు. ఇదే సమయంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు మాత్రం 8.5 లక్షల మంది మొబైల్ యూజర్లు చేరారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో 79.69 లక్షల మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లను కోల్పోగా, భారతీ ఎయిర్టెల్ 14.34 లక్షల యూజర్లు, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ నుంచి 15.53 లక్షల మంది వెళ్లిపోయారు. సెప్టెంబర్ చివరి నాటికి జియో మొబైల్ సబ్‌స్ర్కైబర్లు 46.37 కోట్లు, ఎయిర్‌టెల్‌కు 38.34 కోట్లు, వొడాఫోన్ ఐడియా 21.24 కోట్ల మంది ఉన్నారు. అలాగే ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కింద 9.18 కోట్ల మంది ఉన్నారు. జూలై నెలలో మొబైల్ టారిఫ్ చార్జీలను 10-27 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రైవేట్ టెలికం దిగ్గజాలు ప్రకటించాయి. దీంతో మొబైల్ కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ బాట పట్టారు.