హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐటీ రంగంతో పోటీగా తయారీరంగం దూసుకుపోతున్నది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసి పదిరోజులు కాకముందే మూడు తయారీరంగ పరిశ్రమలు రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా, యూరోప్ దేశాల ఔషధ, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. తాజాగా రెండు ప్లాస్టిక్ కంపెనీలు రూ.250 కోట్ల చొప్పున, జిప్సమ్ కంపెనీ రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
ఈ కంపెనీలు నాణ్యమైన ప్లాస్టిక్ పైపులు, ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేయనున్నాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు ఇదివరకే అధికారులతో పలుదఫాలు సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలపై చర్చించి ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసుకున్నాయి. ప్రస్తుత కంపెనీలకు భిన్నంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను దిగుమతి చేసుకోవాలని..యూరప్, దుబాయ్ టెక్నాలజీని అమలుచేయాలని నిర్ణయించాయి. పరిశ్రమల ఏర్పాటుకు మహబూబ్‌నగర్, పటాన్చెరు, రంగారెడ్డి, విజయవాడ హైవేల్లో స్థలాలను పరిశీలిస్తున్నాయి. స్థలాల ఎంపిక పూర్తయ్యాక కేటీఆర్‌తో సమావేశమై పెట్టుబడి ప్రకటనను అధికారికంగా ప్రకటించాలని కంపెనీల ప్రతినిధులు నిర్ణయించారు.