ముంబై, జూలై 3: రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కొత్త చిక్కుల్లోపడ్డారు. విదేశీ ఆస్తులకు సంబంధించి ఓ ఫెమా (విదేశీ మారకం నిర్వహణ చట్టం) కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం దక్షిణ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. దాదాపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ విచారణ సాగడం గమనార్హం. విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఆయనను ప్రశ్నించినట్టు ఈడీ అధికారులు తెలిపారు.
వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టూ వారు పేర్కొన్నారు. అనిల్‌పై ఫెమా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు చెప్తున్నారు. కాగా, అనిల్ అంబానీతోపాటు ఆయన భార్య టినా అంబానీ ఈ వారంలో మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఈడీ సమన్లు జారీ చేసింది.