Reliance Future Leaders | రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన వారసులకు బాధ్యతలు అప్పగించారు. తన గారాల పట్టి ఈషా అంబానీకి రిటైల్ బిజినెస్ కేటాయించగా, చిన్న కొడుకు అనంత్ అంబానీకి న్యూ ఎనర్జీ సారధ్యం కేటాయించారు. ఇక రిలయన్స్ జియో చైర్మన్గా పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ బాధ్యతలు చేపడతారు. ఈ అంశంపై సోమవారం జరిగిన రిలయన్స్ 45వ వార్షిక వాటాదారుల (ఏజీఎం) సమావేశంలో ముకేశ్ అంబానీ ప్రకటన చేశారు.
`మా రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీ ఆలోచనలకు ఆకాశ్, ఈషా, అనంత్ వారసులు. సీనియర్ నేతల మార్గదర్శకత్వంతో వారు రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. నాతో సహా మార్గదర్శకులంతా ఆయా సంస్థల్లో బోర్డు డైరెక్టర్లుగా ఉంటారు` అని ముకేశ్ అంబానీ తెలిపారు.
ఎఫ్ఎంసీజీ బిజినెస్నూ ప్రారంభిస్తామని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఈషా అంబానీ చెప్పారు. దేశవ్యాప్తంగా 260 నగరాలకు జియో మార్ట్ సేవలు చేరాయన్నారు. ప్రతిరోజూ ఈ-కామర్స్ ద్వారా సుమారు ఆరు లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తున్నామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 2.5 రెట్లు ఆర్డర్లు పెరిగాయన్నారు. గతేడాది 2,500 కొత్త స్టోర్లు తెరవడంతో మొత్తం రిలయన్స్ రిటైల్ స్టోర్లు 15 వేలు దాటాయి.
గత ఏడాది కాలంలో రిలయన్స్ రిటైల్లో దాదాపు 1.5 లక్షల ఉద్యోగాలు లభించాయి. దీంతో మొత్తం రిలయన్స్ రిటైల్ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది సంఖ్య 3.60 లక్షలు దాటింది. గతేడాది 20 కోట్లకు పైగా రిజిస్టర్డ్ కస్టమర్లకు సేవలందిస్తే, స్టోర్లకు 52 కోట్ల మంది వచ్చారని ఈషా అంబానీ తెలిపారు.