Mahindra Scorpio | భారత్ మార్కెట్లో ఏయేటికాయేడు ఎస్యూవీ కార్ల పట్ల క్రేజ్ పెరుగుతోంది. మైక్రో ఎస్యూవీ మొదలు, ఉబెర్-లగ్జరీ మోడల్ వరకూ దేశీయ కార్ల మార్కెట్లో ప్రస్తుతం 50 పై చిలుకు ఎస్యూవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అప్ రైట్ డ్రైవింగ్ స్టాన్స్, హై డ్రైవింగ్ పొజిషన్ ఉన్న ఎస్యూవీ కార్ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్‌యూవీలు, త్రీ రో ఎస్యూవీ కార్లలో పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా ఎక్స్ యూవీ 700, టాటా సఫారీ, హ్యుండాయ్ అల్కాజర్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి మోడల్స్ పాపులరైనా.. వీటన్నింటికంటే బెస్ట్ సెల్లర్ గా నిలిచింది మహీంద్రా స్కార్పియో.
మూడు వరుసల ఎస్యూవీ కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మహీంద్రా స్కార్పియో (స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్) ఉన్నది. గత ఆర్థిక సంవత్సరంలో 1,41,462 యూనిట్లు విక్రయించింది. తర్వాతీ స్థానంలో నిలిచిన మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడల్ కారు 79,398 యూనిట్స్ విక్రయించింది. 2023-24లో మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 40,831 యూనిట్ల విక్రయాలతో స్కార్పియో ముందు వరుసలో నిలిస్తే, మహీంద్రా ఎక్స్ యూవీ 700 కారు కేవలం 17,070 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది.
మహీంద్రా స్కార్పియో ఎన్ ధర రూ.13.85 లక్షల నుంచి రూ.24.54 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. స్కార్పియో క్లాసిక్ ధర రూ.13.62 లక్షల నుంచి రూ.17.42 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది.
ఇక స్కార్పియో ఎన్ కారు 2.0 లీటర్ల ఎంస్టాలియన్ టీజీడీఐ పెట్రోల్/ 2.2 లీటర్ల ఎం హాక్ సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 203 పీఎస్ విద్యుత్, 370 ఎన్ఎం టార్క్ వెలువరించడంతోపాటు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఆటోమేటిక్ వర్షన్ 203 పీఎస్ విద్యుత్ 380 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లో గరిష్టంగా 175 పీఎస్ విద్యుత్, 370 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ 175 పీఎస్ విద్యుత్, 400 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
ఇక స్కార్పియో క్లాసిక్ 2.2 లీటర్ల ఎంహాక్ సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 132 పీఎస్ విద్యుత్, 300 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిసన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ గల స్కార్పియో క్లాసిక్ కారు అందుబాటులో లేదు.