హైదరాబాద్, ఫిబ్రవరి 24 ( నమస్తే తెలంగాణ ) : అమెరికాలోనే అతిపెద్ద బయో టెక్నాలజీ సంస్థ అమ్జెన్..హైదరాబాద్లో నూతన టెక్నాలజీ, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. రహేజా నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో రాబర్ట్ బ్రాడ్వే మాట్లాడుతూ..వ్యాపార విస్తరణలో భాగంగా ఈ నూతన సెంటర్ను నెలకొల్పినట్లు, భవిష్యత్తులో 200 మిలియన్ డాలర్లు(రూ.1,600 కోట్లకు పైమాటే) పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత ‘ఏఐ సిటీ’లో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా – క్వీన్స్ లాండ్ ప్రభుత్వ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. క్వీన్స్ లాండ్ రాష్ట్ర ఫైనాన్స్, ట్రేడ్, ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్ మంత్రి రాసిన్ బేట్స్ ఆధ్వర్యంలోని బృందం శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ‘తెలంగాణ-క్వీన్స్ లాండ్’ మధ్య ప్రాధాన్య రంగాల్లో సంబంధాలను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.
క్రిటికల్ మైనింగ్ రంగంలో పరస్పర సహకారం కోసం క్వీన్స్లాండ్ (ఆస్ట్రేలియా)తో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంకానుంది. 11 రకాల ఖనిజాల వెలికితీతలో పరస్పర సహకారం అందించుకోనున్నాయి.