హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ దేశంలోనే మొదటిసారిగా తమ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నది. సుమారు రూ.9 వేల కోట్లు పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు తెలిపింది. ఈమేరకు సోమవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమైందని కంపెనీ ప్రకటించింది. ఇకడి నుంచే దేశంలో ఉన్న ఎలీ లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్షరింగ్ నెట్వర్క్ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనున్నట్లు పేర్కొన్నది.
కొత్త హబ్ ఏర్పాటుతో మన రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. త్వరలో కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజెమెంట్ నిపుణులు, ఇంజినీర్లను నియమించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తున్న ఎల్ లిల్లీ కంపెనీ ముఖ్యంగా డయాబెటిస్, ఓబెసిటీ, ఆల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిషరణలపై ఈ కంపెనీ కృషిచేస్తున్నది.
ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో కంపెనీ కార్యకలాపాలుండగా హైదరాబాద్‌లో ఈ ఏడాది ఆగస్టులో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుందని జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. 40శాతం బల్ డ్రగ్స్ హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని కొవిడ్ వ్యాక్సిన్లను ఇకడే తయారుచేసినట్లు ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.