Donald Trump | మళ్లీ అధికారంలోకి వస్తే అమెరికాకు స్వర్ణ యుగాన్ని తెస్తానంటూ గద్దెనెక్కిన డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్యాన్ని అధోగతిపాలు చేస్తున్నారిప్పుడు.
దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుంటున్న సంకేతాలు వస్తున్నాయి మరి. ట్రంప్ విధానాలు ప్రపంచ దేశాలకేగాక, స్వదేశానికీ ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి.
ఎదురు తిరిగితే ఏ దేశంపైనైనా ప్రతీకార సుంకాలతో విరుచుకుపడిపోతున్న ట్రంప్.. దీనివల్ల సొంత దేశంపై ఏ రకమైన ప్రభావం పడుతున్నదో చూసుకోవట్లేదు. ఫలితంగా స్వజాతీయుల నుంచే విమర్శల్ని మూటగట్టుకుంటున్నారు.
వాషింగ్టన్/న్యూఢిల్లీ, ఆగస్టు 2: ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్.. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యాన్ని అబాసుపాలు చేస్తున్నాయి. ‘పెద్దన్న’గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలపర్చాల్సిందిపోయి.. ప్రతీకార సుంకాలతో రగిలిపోతూ బలహీనపరుస్తున్నారు మరి. నిరుడుతో పోల్చితే తగ్గిన ఉద్యోగాలు, పెరిగిన ద్రవ్యోల్బణం, మందగిస్తున్న జీడీపీ ఇదీ.. ఆ దేశంలో ఇప్పుడు నెలకొన్న దుస్థితి. అవును.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతల్లోకి వచ్చి కేవలం ఆరున్నర నెలలే కావస్తున్నా.. టారిఫ్‌ల పెంపు, కొత్త పన్ను విధానం, ఖర్చుల కారణంగా అక్కడి వాణిజ్య, తయారీ, ఇంధన రంగాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
ట్రంపరితనంతో..
జూలైలో ఉద్యోగ గణాంకాలు తగ్గిపోవడంపట్ల ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సదరు డాటాను ఇచ్చిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్ఎస్) డైరెక్టర్ ఎరికా మెక్ఎంటర్ఫర్ను తొలగించేశారు. ఎరికా.. బైడెన్ హయాంలో వచ్చినవారని, అందుకే రాజకీయంగా తనను అప్రతిష్టపాలు చేసేందుకు ఈ తప్పుడు గణాంకాలిచ్చారని ట్రంప్ మండిపడ్డారు.
రష్యా చమురు ఆగలేదు
‘తమ ఒత్తిళ్లకు తలొగ్గిన భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేసిందని తెలుస్తున్నది. ఇదే నిజమైతే అది మంచి నిర్ణయం’ అని ట్రంప్ శనివారం చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగినట్టు తమకైతే తెలియదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆ రంగాల్లో రాయితీ వద్దు
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయం, పాడి, జెనెటికల్లీ మోడిఫైడ్ (జీఎం) ఫుడ్స్‌పై విధిస్తున్న సుంకాల్లో రాయితీలకు దిగితే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఈ రంగాల్లోని వస్తూత్పత్తులపైనా సుంకాలను తగ్గించాలని పట్టుబడుతున్నది. అయితే అమెరికాలో కార్పొరేట్ల చేతిలో ఉన్న వ్యవసాయ, పాడి, జీఎం ఫుడ్స్ రంగాలు.. భారత్‌లో మాత్రం వ్యక్తిగతంగా రైతుల చేతుల్లోనే ఉన్నాయని వారు చెప్తున్నారు. దీంతో సుంకాల్లో రాయితీకి అంగీకరిస్తే.. కుప్పలు తెప్పలుగా విదేశాల నుంచి దేశీయ మార్కెట్లోకి ఆయా వస్తూత్పత్తులు వస్తాయని, ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో ధరలు పడిపోయి, ఇక్కడ వాటిపై ఆధారపడిన రైతులు, ఉద్యోగులు రోడ్డునపడే దుస్థితి నెలకొంటుందని పేర్కొంటున్నారు.
ద్వైపాక్షిక వాణిజ్యం..
ఇక 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరాలన్న లక్ష్యంతో అమెరికా-భారత్‌లు ఒప్పందానికి దిగుతున్నాయి. ప్రస్తుతం ఇది 190 బిలియన్ డాలర్లే. కాగా, ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, వ్యవసాయం, పాల ఉత్పత్తులు, యాపిల్స్, ట్రీ నట్స్, జీఎం ఫుడ్స్ పంటలపై సుంకాల్లో భారత్ నుంచి అమెరికా రాయితీలను ఆశిస్తున్నది. మరోవైపు ఇప్పుడు విధించిన 25 శాతం అదనపు టారిఫ్‌తోపాటు ఉక్కు, అల్యూమినియంపై వేసిన 50 శాతం, ఆటో రంగంపై విధించిన 25 శాతం సుంకాలను తొలగించాలని అమెరికాను భారత్ కోరుతున్నది. అలాగే దేశంలో ఎక్కువమందికి జీవనాధారంగా ఉన్న టెక్స్టైల్స్, రత్నాలు-ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, దుస్తులు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపై సుంకాలు వద్దంటున్నది.
ఆటోమోటివ్, టైర్ ఇండస్ట్రీకి దెబ్బ
ఆసియాలోని ఆయా దేశాలతో పోల్చితే భారత్ నుంచి అమెరికాకు వస్తున్న ఆటోమోటివ్, టైర్ ఇండస్ట్రీస్ ఎగుమతులపై ట్రంప్ వేసిన సుంకాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ రంగాల్లో అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌కు గట్టి పోటీనిస్తున్న జపాన్, వియత్నాం, ఇండోనేషియా తదితర దేశాలపై ట్రంప్ తక్కువ సుంకాలనే వేశారని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చెప్తున్నది. ఆటో విడిభాగాలపై 27 శాతం, టైర్లపై 17 శాతం టారిఫ్‌లు పడుతున్నాయి. దీంతో ఆయా పరిశ్రమలు ఇప్పు డు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. టారిఫ్‌లు తగ్గకపోతే ఇండస్ట్రీ ఎగుమతులు పడిపోయే వీలుందని హెచ్చరిస్తున్నాయి. 2024-25లో భారతీయ ఆటో కంపొనెంట్స్ ఇండస్ట్రీ టర్నోవర్ 80.2 బిలి యన్ డాలర్లు (రూ.6.73 లక్షల కోట్లు)గా ఉన్నది.
ప్రస్తుతం టారిఫ్‌లు ఎంత?
భారత్‌లో దిగుమతి సుంకాల సగటు దాదాపు 17 శాతంగా ఉంటే, అమెరికాలో ఇది 3.3 శాతంగా ఉన్నది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 2న భారత్‌పై 26 శాతం (16 శాతం ప్రతీకార సుంకం, 10 శాతం కనీస సుంకం) అదనపు సుంకాలను ట్రంప్ విధించారు. కానీ ఇటీవలే దాన్ని 25 శాతానికి మార్చారు. ఇది ఈ నెల 7 నుంచి అమల్లోకి రానున్నది. ప్రస్తుతానికైతే అమెరికాకు ఎగుమతి అవుతున్న భారతీయ వస్తూత్పత్తులపై అదనంగా 10 శాతం కనీస సుంకమే పడుతున్నది. 7 తేదీ నుంచి ఈ 10 శాతం స్థానంలో 25 శాతం వచ్చి చేరుతుంది. ఉదాహరణకు భారతీయ టెక్స్‌టైల్స్‌పై అమెరికాలో 6-9 శాతం సుంకాలుండేవి. కనీస సుంకంతో 16-19కి చేరాయి. ఆగస్టు 7 నుంచి 31-34 శాతానికి వెళ్తాయి.
ఇదీ సంగతి..
ఉద్యోగాలు: కొత్త కొలువులు జూలైలో 73వేలకే పరిమితమయ్యా యి. గత ఏడాది సగటున ఒక్కో నెల 1.68 లక్షల ఉద్యోగాలు రావడం విశేషం. టారిఫ్‌లు, పెరిగిన ధరలే ఇందుకు కారణం. టారిఫ్‌లు ప్రకటించిన దగ్గర్నుంచి తయారీ రంగంలో 37వేల ఉద్యోగాలు పోయాయి. పెట్టుబడులు, వినీమయం నీరసించిపోవడంతో ఉద్యోగ-ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని చెప్తున్నారు.
జీడీపీ: అమెరికా జీడీపీ ఈ జనవరి-మార్చిలో మైనస్ 0.3 శాతంగా నమోదైంది. నిరుడు అక్టోబర్-డిసెంబర్లో 2.4 శాతంగా ఉన్నది. ఇక ఏడాది మొత్తానికున్న అంచనాలూ 2.2 శాతానికి పరిమితమవుతున్నాయి. దిగుమతులు మైనస్ 5 శాతానికి పడిపోవడం మార్కెట్ పరిస్థితులకు అద్దం పడుతున్నది.
ద్రవ్యోల్బణం: ఏడాది కిందటితో పోల్చితే జూన్‌లో ద్రవ్యోల్బణం 2.6 శాతానికి ఎగిసింది. మే నెలలో 2.4 శాతంగా ఉన్నది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆమోదయోగ్య స్థాయి 2 శాతమే. కాబట్టే ట్రంప్ ఎంత ఒత్తిడి తెచ్చినా కీలక వడ్డీరేటును 4.3 శాతం వద్దే ఫెడ్ రిజర్వ్ ఉంచుతున్నది. దీంతో ఫెడ్ చీఫ్‌కు, ట్రంప్‌కు మధ్య విభేదాలు కూడా నెలకొన్నాయి.