Mukesh & Bezos on IPL | అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరులు.. ఇప్పటికే పలు రంగాల్లో పరస్పరం పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నారు. క్రికెట్ టోర్నీల్లో అతిపెద్దదైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల కోసం పోటీ పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల వీక్షకులను సంపాదించుకున్న ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్స్ ఈవెంట్ ఐపీఎల్ టోర్నీ. దీని బ్రాండ్ విలువ దాదాపు 6 బిలియన్ల డాలర్లు. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం అమెజాన్, రిలయన్స్ బిడ్లు దాఖలు చేశాయి. ఐపీఎల్ టోర్నీ ఐదేండ్ల ప్రసార హక్కులు, ఆన్లైన్ స్ట్రీమింగ్ కాంట్రాక్ట్ కోసం వేర్వేరు బిడ్లు వేశాయి. పలు ఇతర సంస్థలు కూడా వేర్వేరుగా బిడ్లు దాఖలు చేశాయి.
కానీ ఈ ఐపీఎల్ టోర్నీ ప్రసారహక్కులు, లైవ్ స్ట్రీమ్ కాంట్రాక్ట్ హక్కులను గెలుచుకునేందుకు ఇటు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, అటు రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ దూకుడుగా ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 12న ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయానికి వేలం నిర్వహించనున్నారు. వాల్ట్ డిస్నీతోపాటు సోనీ గ్రూప్ కార్పొరేషన్ కూడా పోటీలో ఉన్నాయి. ఈ బిడ్ గెలుచుకున్న సంస్థకు ఐపీఎల్ 2023 నుంచి నాలుగేండ్ల పాటు ప్రసార హక్కులు లభిస్తాయి. ఐపీఎల్‌ను బీసీసీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
దాదాపు 140 కోట్ల మంది వీక్షకులు గల ఐపీఎల్ ప్రసార హక్కులు సొంతం చేసుకుంటే భారత్ కన్జూమర్ మార్కెట్‌పై పట్టు సాధించినట్లే. మరోవైపు భారత్‌లో ఆన్లైన్ కొనుగోళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఈ లక్ష్య సాధన కోసం జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ గేమ్ ప్లాన్ సిద్ధం చేశాయి. రిటైల్ టూ బ్యాంకింగ్, ట్రావెల్ టు ఎడ్యుకేషన్ వరకు అన్ని రంగాల్లోనూ డేటా వినియోగంలో భారతీయులే కీలకం. ఈ పరిస్థితుల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ విశ్వసనీయ వ్యక్తి మనోజ్ మోదీ, పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ తదితరులతో వార్ రూమ్ మొదలైంది. ఇందులో ఫాక్స్ ఇంక్ మాజీ అధిపతి ఉదయ్ శంకర్ కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ క్రీడా టోర్నీల్లో ఐపీఎల్ ఒకటిగా గుర్తించింది అమెజాన్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఐపీఎల్ టోర్నీ ప్రసారహక్కులను సొంతం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది.