Ambani-Aadani | భారతీయ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ సంపద తగ్గిపోయింది. వారిద్దరూ 100 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఔటయ్యారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. వ్యాపార పరంగా వారిద్దరికి ఎదురైన సవాళ్లే కారణమని వెల్లడించింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద గత జూలైలో 120.8 బిలియన్ డాలర్లయితే, ఈ నెల 13 కల్లా 96.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. రిలయన్స్ అనుబంధ రిటైల్, ఎనర్జీ రంగాలు ఆశించిన మేరకు రాణించక పోవడంతో ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద తగ్గిందని బ్లూంబర్గ్ బిలియనీర్స్ తెలిపింది.
ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ సంపద 122.3 బిలియన్ డాలర్ల నుంచి 82.1 బిలియన్ డాలర్లకు దిగి వచ్చింది. సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాల కోసం భారత్ లోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు ముడుపులు ఇచ్చారని అమెరికాలో కేసు నమోదు కావడంతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనం అయ్యాయి. అంతకు ముందు అమెరికా షార్ట్ షెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ కూడా అదానీ గ్రూప్ సంస్థలపై ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల విలువ కృత్రిమంగా పెంచిందని హిండెన్ బర్గ్ తెలిపింది.
గౌతం అదానీ, ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద నష్టపోయినా, దేశంలోని టాప్-20 బిలియనీర్ల సంపద 67.3 బిలియన్ డాలర్లు వృద్ధి చెందడం గమనార్హం. వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త శివ్ నాడార్ 10.8 బిలియన్ డాలర్లు, ఉక్కు పారిశ్రామికవేత్త సావిత్రి జిందాల్ 10.1 బిలియన్ డాలర్ల సంపద పెంచుకున్నారు.